సాక్షి, తాడేపల్లి: గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ పలువురు నిరుద్యోగులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. ఫేజ్-2 జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల వయో సడలింపు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెగ్యులర్‌గా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే వయోపరిమితి దాటిపోయి లక్షలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని వన్‌టైమ్ సడలింపు కింద 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలు, విజ్ఞప్తులపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.


