AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక | Lightning Alert Issued For Several Andhra Pradesh Districts, Heavy Rains And Strong Winds Expected | Sakshi
Sakshi News home page

AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

Sep 17 2026 3:20 PM | Updated on Sep 17 2026 3:59 PM

Lightning Warning For Several Districts In Andhra Pradesh

సాక్షి, అమరావతి: పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ  అయ్యింది. ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని  విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 19 నాటికి ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇది బలపడి దక్షిణ ఒడిస్సా–ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే వారం కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

గురువారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

ఇదిలావుండగా బుధవారం కాకినాడ జిల్లా రౌతులపూడిలో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా మర్రిపాలెంలో 5.4, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 4.8, కాకినాడ జిల్ల  కోనపాపపేట 4.6, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 4.5, అనకాపల్లిలో 4.4, పాయకరావుపేటలో 4.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగింది. పగటిపూటి వేసవిని తలపించేలా ఎండలు మండాయి. 

ఇదీ చదవండి: సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement