ఐదుగురి అరెస్టుతో సరిపుచ్చారు... | Minor Girls Incident In Guntur | Sakshi
Sakshi News home page

ఐదుగురి అరెస్టుతో సరిపుచ్చారు...

Sep 17 2026 1:17 PM | Updated on Sep 17 2026 2:22 PM

Minor Girls Incident In Guntur

గుంటూరు : మైనర్‌ను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మైనర్‌ను సుమారు ఏడాదిపాటు వ్యభిచార కూపంలోకి దించిన మహిళ, మరో నలుగురు వ్యక్తుల అరెస్ట్‌ విషయంలో ఏదైనా మతలబు జరిగిందా..? అనే అనుమానాలు లేకపోలేదు. పది రోజుల క్రితం గుంటూరు ఈస్ట్‌ సబ్‌డివిజన్‌ పాతగుంటూరు పోలీసుస్టేషన్‌లో మైనర్‌తో వ్యభిచారం చేయించిన ఘటనపై కేసు నమోదైంది. 

పరిస్థితిని ఆసరాగా తీసుకుని... 
మైనర్‌ విద్యార్థిని తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఒంగోలులో ఉంటున్న తల్లి దగ్గర నుంచి తండ్రి వద్దకు వచ్చిన మైనర్‌ను నగరంలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేర్పించారు. ఈ క్రమంలో తండ్రి పాతగుంటూరు బాలాజీనగర్‌లో నివాసం ఉండే తన సోదరుడి దగ్గర కుమార్తెను ఉంచి చదివిస్తున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే పావని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. విద్యార్థినికి మాయమాటలు చెప్పి, లేనిపోని ఆశలు చూపి వ్యభిచార కూపంలోకి దించింది. అసలు ఆ బాలిక ఇంటికి కూడా సరిగా రావడం లేదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై ఈ నెల 5వ తేదీన పాతగుంటూరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. 

తొలి నుంచి గోప్యమే... 
ఈ కేసులో పోలీసులు తొలి నుంచి గోప్యంగానే వ్యవహరించారు. విషయం బయటకు పొక్కకుండా, మీడియా అడుగుతున్నప్పటికీ సమాధానం దాటవేస్తూ వచ్చారు. ప్రధాన నిందితురాలు పావని, ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. తర్వాత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్‌ చేసి, వారిని సైలెంట్‌గా కోర్టుకు హాజరుపరిచారు. ఫిర్యాదులో స్పష్టంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్, విజయవాడతో పాటు పలు ప్రాంతాలకు పావని తనను తీసుకుని వెళ్లిందని మైనర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలల తరబడి ఈ తంతు జరిగినా కేవలం ముగ్గురిని మాత్రమే నిందితులుగా చూపడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అసలు ఏ లాడ్జికి తీసుకుని వెళ్లారు.. అక్కడ ఆధార్‌ ఏం ఇచ్చారు.. మైనర్‌ లాడ్జిలోకి వెళ్తుంటే ఎలా అంగీకరించారు..? అనే అంశాలు మిస్టరీగానే ఉన్నాయి. ఈ కేసులో ఇంకెంత మంది నిందితులు ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

నాడు బాధితులకు న్యాయం 
మేడికొండూరుకు చెందిన ఒక మైనర్‌ ఘటన గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసు విషయంలో అప్పటి వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీగా ఉన్న కె. సుప్రజ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఏపీ, తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలకు వెళ్లి మరీ 112 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. అందులో ఇద్దరికి లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) కూడా జారీ చేశారు. ఈ కేసు విచారణ సుమారు సుదీర్ఘంగా మూడు నెలలపైనే సాగింది. నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగింది.  

తీవ్ర నిర్లక్ష్యం 
ఈ కేసు పరిణామంలో పోలీసులు నిందితులను వదిలివేశారా..? కేసును తూతూ మంత్రంగా విచారించారా..? ఎవరైనా పెద్దల ప్రమేయం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పావని, ఆమె భర్త, కేవలం ముగ్గురు విటులుగా ఉన్న వారిని అరెస్ట్‌ చేసి మమ అనిపించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన పోలీసులు.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ఈ కేసులో లాడ్జి నిర్వాహకులు, పావనికి సహకరించిన మరికొంత మందిని ఎందుకు నిందితులుగా చేర్చలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాకు తెలియకుండా అరెస్ట్‌ చూపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.  

ఇదీ చదవండి: టీడీపీ నేతల వికృత చేష్టలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement