ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్‌ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్‌: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్‌ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్‌: వైఎస్‌ జగన్‌

Sep 17 2026 3:42 PM | Updated on Sep 17 2026 5:26 PM

Ys Jagan Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి సెప్టెంబర్‌ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్‌ కో–ఆర్డినే­టర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్‌ జగన్‌ చర్చించారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ వర్షపాతం లోటులోనే ఉన్నాయన్నారు. ‘‘688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. దాదాపు 332 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లాలో 75 శాతం వర్షపాతం లోటు. సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం వర్షపాతం లోటు.

..చిత్తూరులో 58.5 శాతం, వైఎస్సార్‌ కడపలో 57 శాతం వర్షపాతం లోటు. తూర్పుగోదావరిలో 57 శాతం, మార్కాపురం–నంద్యాలలో 56 శాతం చొప్పున వర్షపాతం లోటు. విశాఖపట్నంలో 54 శాతం, అనంతపురంలో 51 శాతం వర్షపాతం లోటు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘జూలై, ఆగస్టులో కూడా తీవ్ర వర్షపాతం లోటు కొనసాగినా కరువు కార్యాచరణ చేపట్టలేదు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకుపైగా నష్టపోయారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటను బట్టి రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయారు. కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి సహా అనేక పంటలు దెబ్బతిన్నాయి

పండ్ల తోటలు కూడా కరువు దెబ్బకు ఎండిపోతున్నాయి. శ్రీశైలం నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు. తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌ పరిధిలోని రిజర్వాయర్లను ముందుగానే నింపాల్సింది. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్ట్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ప‌ట్టించుకోలేదు. పోలవరం పూర్తి సామర్థ్యంపై ప్రభుత్వం రాజీపడుతోంది. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్‌ల పేరుతో ప్రచారం కాకుండా శాశ్వత సాగునీటి పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.

‘‘వరుస వర్షపాతం లోటు కనిపిస్తున్నా కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదు?. కరువు ప్రభావిత మండలాలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలి. కరువు ప్రభావిత రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేయాలి. రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని తిరిగి చెల్లించాలి. గతంలో రైతులకు రావాల్సిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల పరిహారం ఇవ్వాలి. పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారం ఇవ్వాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

‘‘ఉచిత పంటల బీమా కొనసాగి ఉంటే రైతులకు Prevented Sowing సహా బీమా రక్షణ ఉండేది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించాలి. అన్న‌దాత సుఖీభ‌వ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవ‌లం రూ. 19 వేలే. బ‌కాయి ప‌డ్డ రూ. 41 వేలు కూడా రైతుల‌కు ఇవ్వాలి. కౌలు రైతులు, ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులైన రైతులకు మూడేళ్ల‌లో ఎగ్గొట్టిన రూ. 60వేలు ఇవ్వాలి. తుఫాన్ల వల్ల రైతులకు పెండింగ్‌లో ఉన్న పంటల బీమా పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి. కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ వెంటనే ప్రకటించాలి.

..ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సుమారు రూ. 6 వేల కోట్లు రైతులకు అందించాలి. సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేయాలి. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన సున్నా వడ్డీ బకాయిలన్నీ రైతులకు చెల్లించాలి. పశుగ్రాసాన్ని ముందుగానే సమీకరించి కరువు జిల్లా రైతుల‌కు ఉచితంగా పంపిణీ చేయాలి. కరువు కారణంగా వ్యవసాయ కూలీలు వలస వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు అదనంగా 150 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలి. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కోసం కేంద్రాన్ని వెంటనే అదనపు పనిదినాలు కోరాలి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలి.

..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల వల్ల రైతు, పేద కుటుంబాలపై అదనపు భారం పడకూడదు. విద్యా దీవెన–వసతి దీవెన కింద పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.9 వేల కోట్లను విడుదల చేయాలి. కరువు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఉచిత ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలి. గ్రామాల్లో విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలి. రైతులకు ప్రకటించిన ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను కోతలు లేకుండా అందించాలి. బోర్ల కింద ఉన్న పంటలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి.

..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలి. ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలి. పండ్ల తోటలకు నీటి ట్యాంకర్ల ఖర్చుపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి. ముఖ్యంగా చీనీ సహా శాశ్వత పండ్ల తోటలను కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

పరిస్థితి తీవ్రతను బట్టి కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానన్న వైఎస్‌ జగన్‌.. రైతులకు అండగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడుతుందన్నారు. ‘‘ప్రతి జిల్లాలో కరువు పరిస్థితులపై పార్టీ నాయ‌కులు అధ్య‌య‌నం చేసి ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జిల్లాల‌ వారీగా రైతుల ప్రత్యేక డిమాండ్లను కూడా ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుల సమస్యలపై వైయస్సార్‌సీపీ నాయకులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు ఇవ్వాలి. కరువు సమస్యలపై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యాచరణ చేపట్టాలి. దీనికి ముందు మండల స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు రైతులతో సమావేశాలు నిర్వహించాలి. రైతులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్‌ క్లోజ్‌!

‘‘ఎల్‌నినో ప్రభావం వస్తుందని ఫిబ్రవరి 4నే చంద్రబాబు చెప్పారు. తెలిసినా ఆ తర్వాత చేసిన కార్యాచరణ మాత్రం సున్నా. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల తీవ్రత పెరిగింది. వర్షపాతం లోటు కనిపిస్తున్నా స్విచ్‌లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడమే చేశారు. మీ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేలకుపైగా నష్టపోయారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నది ఎల్‌నినో ఎఫెక్ట్‌ కాదు... ‘ఎల్లో నినో ఎఫెక్ట్‌’. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగిన సమయంలో ఇవ్వకుండా, విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారు.

..పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ లిఫ్టులు కడుతున్నా చంద్రబాబు కనీసం నోరు మెదపడం లేదు. రైతుల కోసం చంద్రబాబు మనసు పెట్టి పనిచేస్తున్నారనే భావన ఎక్కడా కనిపించడం లేదు. పోలవరం పూర్తి స్థాయి నీటిమట్టంపై రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటున్నారు. గతంలోనే ఉన్న పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్టులను ఆపరేట్‌ చేసి కొత్తగా తానే నీళ్లు తెచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.

..ఒకవైపు పోలవరంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటూ, మరోవైపు లిఫ్టుల పేరుతో డ్రామాలు చేస్తున్నారు. జూన్‌, జూలై, ఆగస్టు వరుసగా వర్షపాతం లోటు కనిపిస్తున్నప్పుడు కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదు?. కర్ణాటక ముందుగానే కరువు ప్రకటించింది; చంద్రబాబు ప్రభుత్వం ఆ పని కూడా చేయలేకపోయింది. కరువు వస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదు; పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదు; ఉపాధి హామీ అదనపు పనిదినాల కోసం డిమాండ్‌ కూడా పెట్టలేదు’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఇదీ చదవండి: సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement