సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమల ఆలయం ముందు దర్శిణి ఫ్యాషన్స్‌కు చెందిన మహిళ రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాకారులకు మేకప్ చేసేందుకు వచ్చిన దర్శిణి ఫ్యాషన్స్ మహిళ.. ప్రమోషన్ కోసం ఆలయం ముందు రీల్స్ చేసింది. కళాకారులతో దర్శిణి ఫ్యాషన్స్‌పై ఆ మహిళ మాట్లాడించింది. తిరుమలలో రీల్స్, వాణిజ్య ప్రమోషన్స్ నిషేధించిన సంగతి తెలిసిందే.
మాడవీధుల్లో రీల్స్ చేస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదు. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా రీల్స్‌పై విమర్శలు వస్తున్నాయి. రేణిగుంటకు చెందిన దర్శిణి ఫ్యాషన్స్‌గా గుర్తించారు. ఆలయం ముందు వాణిజ్య ప్రచారం చేయడంపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిబంధనలు ఉన్నా తిరుమలలో రీల్స్‌కు అడ్డుకట్ట ఎక్కడ? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.
కాగా, గత నెలలో కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఓ జంట దేవుడి పేరుతో రీల్స్ చేశారు. సర్వదర్శనం క్యూలైన్ పాటు రాంబగీచా ప్రాంతంలోనూ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తిరుమలలో తరచూ ఇలాంటి రీల్స్ వెలుగులోకి వస్తుండడంపై చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక


