గుజరాత్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. మూడు పార్టీలపై ఎఫ్‌ఐఆర్‌! | Donations Row 560 crore tax evasion Case against 3 Gujarat parties | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. మూడు పార్టీలపై ఎఫ్‌ఐఆర్‌!

Sep 28 2026 9:04 AM | Updated on Sep 28 2026 9:04 AM

Donations Row 560 crore tax evasion Case against 3 Gujarat parties

గాంధీనగర్‌: భారీ రాజకీయ విరాళాల వ్యవహారం గుజరాత్‌లో కలకలం రేపుతోంది. దాదాపు రూ.1,870 కోట్ల విరాళాలు స్వీకరించి.. వాటి ద్వారా రూ.560 కోట్లకుపైగా పన్ను కట్టలేదనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో మూడు గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదయ్యాయి.

గాంధీనగర్‌లో నమోదైన భారతీయ నేషనల్‌ జనతా దళ్‌ (BNJD), అహ్మదాబాద్‌లో నమోదైన గరీబ్‌ కళ్యాణ్‌ పార్టీ, స్వతంత్రత అభివ్యక్తి పార్టీలు ఈ కేసుల్లో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఆరోపణల ప్రకారం.. ఈ పార్టీలు బ్యాంకింగ్‌ మార్గాల్లో విరాళాలు స్వీకరించి, దాతలకు నకిలీ డొనేషన్‌ రసీదులు జారీ చేశాయి. అనంతరం మధ్యవర్తి సంస్థల ద్వారా నగదు రూపంలో తిరిగి చెల్లించి, కమీషన్‌ మినహాయించినట్లు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి.

అందులో అత్యధిక మొత్తం BNJDకి సంబంధించినదే. 2019-20 నుంచి 2024-25 మధ్య 56,238 మంది దాతల నుంచి రూ.1,143.85 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ.343 కోట్ల పన్ను నష్టం వాటిల్లినట్లు ఆదాయపు పన్ను శాఖ అంచనా వేసింది. విరాళాల పేరుతో వచ్చిన నగదును మధ్యవర్తి సంస్థలకు తరలించి, నకిలీ బిల్లుల ద్వారా లావాదేవీలను చూపించి, కమీషన్‌ మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని దాతలకు తిరిగి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

BNJD అధ్యక్షుడు సురేంద్రకుమార్‌ గజేరా, ప్రధాన కార్యదర్శి విపుల్‌ సోలంకి, కోశాధికారి రోణక్‌సింహ్‌ చావ్డా, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆదిల్‌ సయ్యద్‌లను కేసులో నిందితులుగా పేర్కొన్నారు. దాతల వివరాలు, నకిలీ రసీదులు, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా పంచుకున్నట్లు, కొన్ని ప్రాంతాల్లో సోదాల సందర్భంగా డిజిటల్‌ ఆధారాలు లభించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.

నకిలీ పత్రాలు, విరాళాలు..
గరీబ్‌ కళ్యాణ్‌ పార్టీకి సంబంధించి 2022-23 నుంచి 2025-26 మధ్య రూ.206.76 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి సుమారు రూ.62.02 కోట్ల పన్ను నష్టం జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. మరోవైపు స్వతంత్రత అభివ్యక్తి పార్టీ సుమారు రూ.519 కోట్ల విరాళాలు స్వీకరించినట్లు, దాంతో దాదాపు రూ.155 కోట్ల పన్ను నష్టం జరిగినట్లు కేసులో ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు కేసుల్లోనూ నకిలీ పత్రాలు, తప్పుడు అకౌంటింగ్‌ రికార్డులు, విరాళాల వివరాలను సమర్పించడంపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పార్టీలు, వాటికి సంబంధించిన పలువురు పదాధికారులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లను నిందితులుగా చేర్చారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి: జ్ఞానేశ్‌ కుమార్‌పై ఆరోపణలు.. థామ్సన్‌కు బీజేపీ నేత కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement