త్వరలో కొత్త టోల్ చెల్లింపు విధానం అందుబాటులోకి
మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ షురూ
రాష్ట్రంలో 11 టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటుకు టెండర్లు.. 6 నెలల్లో మొదలు
ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్లు, ఏఎన్‌పీఆర్ కెమెరాలతో ఫాస్టాగ్ నుంచి టోల్ వసూలు
ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల విధానం తొలగింపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్ చెల్లించేందుకు వాహనాలు టోల్‌బూత్ వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే టోల్ వసూలయ్యే కొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని 11 టోల్ ప్లాజాల వద్ద ఈ కొత్త విధానంతో కూడిన టోల్‌బూత్‌ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో ఐదారు నెలల్లో కొత్త టోల్ విధానం అమలు కానుంది.
ప్రస్తుత టోల్ విధానానికి స్వస్తి...
నగదు రూపంలో టోల్ చెల్లింపునకు స్వస్తి చెప్తూ తెచ్చిన ఫాస్టాగ్ విధానం వల్ల టోల్ బూత్‌ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదన్న ప్రచారం జరిగినప్పటికీ వాస్తవానికి వాహనాలు కొంతమేర ఆగి ముందుకు కదలాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగి రోడ్లపై వాహనాల రద్దీ ఉంటోంది. అలాంటి వేళల్లో టోల్ బూత్‌ల వద్ద వాహనదారులు అరగంటకుపైగా నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో ఇక ఆ విధానాన్ని ఆపేసి కొత్త విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కసరత్తు ఇప్పటికి సాకారమైంది. కొత్త విధానం ప్రకారం.. ప్రతి లేన్‌పై గ్యాంట్రీలకు అమర్చిన ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్లు, ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, రాడార్, లిడార్ తదితర పరికరాలు వాహనంపై ఉండే ఫాస్టాగ్, వాహన నంబర్, వాహనం వివరాలను గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థకు పంపి టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా లెక్కించి ఫాస్టాగ్ నుంచి వసూలు చేస్తాయి. అంటే వాహనం ఆగకుండా.. బారియర్ ఎత్తే అవసరం లేకుండా.. టోల్ చెల్లించి ముందుకు వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఉన్నట్టుగా ఒక్కో లేన్ బారియర్లు, అక్కడ సిబ్బంది కూర్చునే బూత్, వాహనాన్ని ఆపేసే సిగ్నలింగ్ వ్యవస్థ, బార్ రాడ్... ఇవేవీ ఉండవు. అక్కడ స్వాగత ద్వారం తరహాలో గ్యాంట్రీ ఉంటుంది. దానికే సెన్సార్లు, ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్లు, కెమెరాలు ఇతర పరికరాలు అమర్చి ఉంటాయి. వాహనం నిర్ధారిత లేన్‌లోంచి ముందుకు దూసుకెళ్తున్నప్పుడు ఆ పరికరాలు వాటి పని అవి చేస్తాయి.
తెలంగాణలో 11 టోల్ ప్లాజాలు...
తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న 11 బూత్‌లలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. ఇటీవలే ఈ వ్యవస్థ ఏర్పాటు కంపెనీలను ఎంపిక చేశాయి. 
ఫాస్టాగ్ లేకపోతే?
ఇప్పటివరకు టోల్ వసూళ్లలో ఫాస్టాగ్ విధానమే ప్రధాన ఆధారం. కొత్త పద్ధతిలో మాత్రం ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నిషన్ కెమెరా బ్యాకప్‌గా పనిచేస్తుంది. వాహనంపై ఫాస్టాగ్ లేకపోయినా, ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్ దాన్ని గుర్తించకపోయినా హై–రిజల్యూషన్ ఏఎన్‌పీఆర్ కెమెరా నంబర్ ప్లేట్‌ను గుర్తించి వీఆర్‌ఎన్ ఆధారంగా లావాదేవీ నమోదు చేయగలదు. ఒకవేళ ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వెంటనే వాహనాన్ని ఆపరు. తక్కువ బ్యాలెన్స్ ఉన్న సందర్భంలో వాహనదారుడికి 24 గంటల సమయం ఇచ్చి పాస్టాగ్ రీచార్జ్ చేసుకొని టోల్ చెల్లించే అవకాశం ఉంటుంది. ఆ గడువులో చెల్లించకపోతే ఆధారాలతో ఈ–నోటీస్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే కొత్త వ్యవస్థ పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడదు. ఏఎన్‌పీఆర్ లేదా ఆర్‌ఎఫ్‌ఐడీ సరిగా రికార్డు చేయని లావాదేవీలను కంట్రోల్ సెంటర్‌లో సిబ్బంది మాన్యువల్‌గా వాలిడేట్ చేయాల్సి ఉంటుంది. 24 గంటలూ పరికరాల పనితీరును పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలని టెండర్‌లో పేర్కొన్నారు.
గుజరాత్‌లో మొదలై.. తెలంగాణకు...
దేశంలో మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానం తొలుత గుజరాత్‌లోని ఎన్‌హెచ్–48పై చోరయాసి టోల్ ప్లాజా వద్ద ప్రయోగాత్మక పరిశీలనతో మొదలైంది. అక్కడి ప్రయోగాలు సత్ఫలితాలివ్వడంతో దీన్ని మిగతా రోడ్లపై అమలు చేసేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాజస్తాన్, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో విడతలవారీగా ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 11 టోల్ ప్లాజాలను ఎంపిక చేశారు. వేగంగా టోల్ చెల్లింపు ప్రక్రియ పూర్తవడం ద్వారా వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా వాటి సాధారణ వేగంతోనూ టోల్ ప్లాజాల మీదుగా దూసుకువెళ్లేలా కేంద్రం గతంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైటింగ్ సిస్టం ఆధారిత టోలింగ్ వైపు దృష్టి సారించింది. దాని ప్రయోగాత్మక పరిశీలన కూడా నిర్వహిస్తోంది. కానీ ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాంతోపాటు ఈ మల్టీలేన్ ఫ్రీఫ్లో టోలింగ్ విధానాన్ని విస్తరించాలని నిర్ణయించింది.


