ఆర్థిక ఇబ్బందుల్లోనూ టీచర్లకు మేలు చేశాం | Minister Sridhar Babu at the STUs 80th anniversary celebrations | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందుల్లోనూ టీచర్లకు మేలు చేశాం

Sep 28 2026 3:10 AM | Updated on Sep 28 2026 3:10 AM

Minister Sridhar Babu at the STUs 80th anniversary celebrations

అనవసర భయాలతో ఆందోళనలు చేయొద్దు 

ఎస్టీయూ 80 వసంతాల వైభవోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటీకీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఉద్యోగులు అనవసర భయాలతో ఆందోళనలు చేయొద్దని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎస్టీయూ) 80 వసంతాల వైభవోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎస్‌టీయూ పోషించిన పాత్రను ప్రస్తావించారు. జాతీయ విద్యా విధానాలపై ఎస్‌టీయూ నిర్మాణాత్మక సూచనలు ఇస్తోందన్నారు. 

ఉద్యోగుల హెల్త్‌ కార్డుల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. డీఏ, పీఆర్సీ అంశాల్లో కదలిక వేగంగా ఉందని చెప్పారు. విద్యారంగానికి, ఉపాధ్యాయులకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు ముందుంటానని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ’తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌’ను ప్రారంభించిందన్నారు. ఈ స్కూళ్లను ప్రతి మండలానికీ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్టీయూ మరింత బలోపేతం కావాలని.. ఉపాధ్యాయ లోకానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే కార్పొరేట్‌ సంస్థల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. టీజీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు దసరా, ఉగాది డీఏలతోపాటు పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి అమలు చేయాలని కోరారు. 

ఆ సంస్థ సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ అమలు చేసి 2028 ఎన్నికల వరకు మరో పీఆర్సీ కమిటీని ప్రకటిస్తే ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలిపారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్‌ మాట్లాడుతూ అన్ని హక్కులు పొందే వరకు ఎస్టీయూ విశ్రమించబోదని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, ఎస్టీయూ నాయకులు, ఏఐఎస్టీఎఫ్‌ వివిధ రాష్ట్రాల నాయకులు, టీచర్లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement