కొత్తగా 41 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం | Applications invited for 41 new bars | Sakshi
Sakshi News home page

కొత్తగా 41 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 28 2026 3:07 AM | Updated on Sep 28 2026 3:07 AM

Applications invited for 41 new bars

నేటి నుంచి అక్టోబర్‌ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ  

దరఖాస్తుకు రూ.లక్ష రుసుము

సాక్షి, హైదరాబాద్‌: క్యూర్‌ ఏరియా పరిధిలో 2బీ బార్లు 14, మిగిలిన మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 27 కలిపి మొత్తం 41 బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రూ.లక్ష రుసుముతో ఈనెల 28 నుంచి అక్టోబర్‌ 12 వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం కల్పించారు. క్యూర్‌ ఏరియా, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో శివారు గ్రామాల విలీనంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాలోని 2బీ బార్లకు రూ.44 లక్షలు, నిజామాబాద్‌ బోధన్‌ బార్‌కు రూ.42 లక్షలు, మిగిలిన 2బీ బార్లకు రూ.30 లక్షలు సంవత్సరానికి ఎక్సైజ్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది.  

గ్రేటర్‌ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలోని 14 బార్లకు సంబంధించిన దరఖాస్తులను అబ్కారీ భవన్‌ కమిషనర్‌ కార్యాలయంలో, ఆయా డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాలల్లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎక్సైజ్‌ శాఖ కల్పించింది. మిగిలిన జిల్లాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో బార్లకు దరఖాస్తులను ఆయా ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాలతోపాటు కమిషనర్‌ కార్యాలయంలోనూ, డీపీఈఓ కార్యాలయాల్లోనూ సమర్పించాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.

సైబరాబాద్‌ డిప్యూటీ కమిషన్‌ పరిధిలోని అలియాబాద్‌లో ఒకటి, మూడు చింతలపల్లి ఎల్లంపేట మున్సిపాలిటీలో రెండు చొప్పున 2బీ బార్లకు సైబరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలోనూ, కుత్బుల్లాపూర్‌ డీపీఈఓ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ పరిధిలోని ఫ్యూచర్‌ సిటీలో చేవెళ్ల మున్సిపాలిటీలో ఒకటి, మొయినాబాద్‌ మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు, వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ పరిగి మున్సిపాలిటీలో, సంగారెడ్డి జిల్లాలోని గడ్డి పోతారం, కోహిర్‌ మున్సిపాలిటీలో ఒకటి చొప్పున, గుమ్మడాల మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానించినట్టు తెలిపారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, కల్లూరు, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని మక్తల్, మహబూబ్‌ నగర్, దేవరకద్ర, నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్, కామారెడ్డి జిల్లాలోని బిడ్డకుంట, వరంగల్‌ జిల్లాలో నర్సంపేట్, జనగామ జిల్లాలో స్టేషన్‌ ఘన్‌పూర్, మహబూబాబాద్‌ జిల్లాలో కే సముద్రం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మున్సిపాలిటీలో కొత్త 2బీ బార్లకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. మరిన్ని వివరాల కోసం  ్టజbఛి .్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఎక్సైజ్‌ అధికారులు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement