రూ.10 వేలు ఇవ్వలేదని 14 దుకాణాలకు నిప్పుపెట్టి విధ్వంసం | Miffed over Rs 10000 employee sets boss Surat shop on fire | Sakshi
Sakshi News home page

రూ.10 వేలు ఇవ్వలేదని 14 దుకాణాలకు నిప్పుపెట్టి విధ్వంసం

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

Miffed over Rs 10000 employee sets boss Surat shop on fire

గుజరాత్‌లోని సూరత్‌లో రూ.10,000 బకాయి చెల్లింపు వివాదం భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. యజమాని దుకాణానికి నిప్పుపెట్టాడు ఓ మాజీ అకౌంటెంట్‌. నిందితుడు వినోద్‌ పండిట్‌ సావాలే(33)ను సూరత్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అరెస్ట్‌ చేసింది. సెప్టెంబర్‌ 9న సరోలి ప్రాంతంలోని శ్యామ్‌ సంగిణి టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో జరిగిన ఈ ఘటనలో సుమారు 14 దుకాణాలు దగ్ధమయ్యాయి. వస్త్రాలు, ఇతర వస్తువులు కలిపి దాదాపు రూ.24 కోట్ల నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

సావాలే 2026 ఏప్రిల్‌లో నెలకు సుమారు రూ.30,000 జీతంతో ఓ దుకాణంలో అకౌంటెంట్‌గా చేరాడు. పని విషయంలో యజమానితో విభేదాలు రావడంతో ఉద్యోగం మానేశాడు. తనకు సుమారు రూ.10,000 చెల్లించాల్సి ఉందని అతను చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ మొత్తంపై ఏర్పడిన వివాదంతో ఆగ్రహానికి గురై అగ్నిప్రమాదానికి పథకం వేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సావాలే తొలుత దుకాణానికి నిప్పుపెట్టేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాడు. అనంతరం సుమారు రూ.150 విలువైన పెట్రోల్‌ను ప్లాస్టిక్‌ సంచి, సీసాలో తీసుకుని సెప్టెంబర్‌ 8 రాత్రి 9 గంటల సమయంలో మార్కెట్‌కు చేరుకున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మార్కెట్‌ నిర్మానుష్యంగా మారిన తర్వాత ఐదో అంతస్తులోని మెట్ల సమీపం నుంచి వెళ్లి, దుకాణం బయట ఉన్న వస్త్రాల పెట్టెలు, పార్సిళ్లపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.

తెల్ల రుమాలుతో ముఖాన్ని కప్పుకుని బ్యాగ్‌తో మార్కెట్‌లోకి వచ్చిన వ్యక్తి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. సూరత్‌ పోలీసుల ‘విశ్వాస్‌ ప్రాజెక్ట్‌’ రెండో దశలోని 1,500కు పైగా సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, అనుమానితుడి రాకపోకలను వెనుకకు, ముందుకు ట్రాక్‌ చేయడంతో సావాలేను గుర్తించారు. అగ్నిప్రమాదం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, కేసు నమోదైన విషయం తెలియడంతో అతను ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి భార్య, బిడ్డతో సూరత్‌ నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. రాజస్థాన్‌లోని ఖాటు శ్యామ్‌ ఆలయం, ఆ తర్వాత అయోధ్యకు వెళ్లిన అతను తిరిగి సూరత్‌కు వచ్చినప్పుడు దిండోలిలోని ఫ్లవర్‌ గార్డెన్‌ సమీపంలో అరెస్టయ్యాడు.

పోలీసుల అంచనా ప్రకారం నష్టం సుమారు రూ.24 కోట్లు కాగా, సూరత్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ కరణ్‌రాజ్‌ వాఘేలా మొత్తం నష్టం దాదాపు రూ.25 కోట్లుగా పేర్కొన్నారు. పెట్రోల్‌ ఎలా సమకూర్చుకున్నాడు, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పెట్రోల్‌ విక్రయించిన పంపు నిర్వాహకుడి పాత్రను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement