సాధారణంగా చిన్నప్పుడు చాలామంది పిల్లలకు ఏదో ఒక వాహనం అంటే ఇష్టం ఉంటుంది. అలాగే.. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నెహా ఠాకూర్‌కు ట్రక్కులపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి చివరికి ఆమె కెరీర్‌గా మారింది.
నెహా ఠాకూర్ తండ్రి ట్రక్ డ్రైవర్ కావడంతో చిన్నప్పటి నుంచే ఆమెకు ట్రక్కులతో పరిచయం ఏర్పడింది. తండ్రి ట్రక్‌లోనే స్కూల్‌కు తీసుకెళ్లేవారని, అప్పటి నుంచే ఆ వాహనం తనను ఎంతగానో ఆకర్షించేదని నెహా చెబుతుంది. తండ్రిని చూస్తూ పెరిగిన నెహాకు ఆయన కేవలం తండ్రి మాత్రమే కాదు.. తొలి రోల్ మోడల్ కూడా.
ఎయిర్ హోస్టెస్‌గా ట్రైనింగ్
అయితే.. చదువు పూర్తయ్యాక ఆమె నేరుగా ట్రక్ డ్రైవింగ్‌లోకి రాలేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత చండీగఢ్ వెళ్లి ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ తీసుకుంది. కానీ.. కొంతకాలానికి తనకు నిజంగా ఇష్టమైనది ఏంటో గుర్తించి మళ్లీ ట్రక్కుల వైపు అడుగులు వేసింది.
2022లో ట్రక్ నడపడం ప్రారంభించిన నెహాకు ఈ నిర్ణయంలో తండ్రి పూర్తి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి రోడ్లపైనే ఆమెకు కొత్త ప్రపంచం కనిపించింది. కొండలు, వర్షాలు, పొడవైన ప్రయాణాలు, ట్రక్కులో సరుకు ఎక్కించడం, దించడం.. ఇలా తన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం మొదలుపెట్టింది.
క్లిష్టమైన మార్గంలో కూడా..
ఒకసారి చాలా మంది ట్రక్ డ్రైవర్లు కూడా వెళ్లడానికి ఇష్టపడని ఓ క్లిష్టమైన మార్గంలో నెహా ట్రక్ నడిపింది. ఆ ప్రయాణానికి సంబంధించిన రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి లక్షలాది వ్యూస్ సాధించింది. ఇంత చిన్న వయసులో అంత ధైర్యంగా ట్రక్ నడపడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
అయితే.. నెహాకు సోషల్ మీడియాలో కంటెంట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏదైనా వెతకాల్సిన అవసరం లేదు. తాను ప్రతిరోజూ చేసే పనులే తన కంటెంట్‌గా మారుతున్నాయని ఆమె చెబుతుంది. ట్రక్ స్టార్ట్ చేసినప్పుడే తన కెమెరా కూడా స్టార్ట్ అవుతుందని, ప్రయాణంలో కనిపించే ప్రతి అనుభవాన్ని రికార్డ్ చేస్తానని చెబుతుంది.
చిన్నప్పుడు తండ్రి ట్రక్‌లో స్కూల్‌కు వెళ్లిన నెహా.. ఇప్పుడు అదే ట్రక్‌ను తానే నడుపుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎయిర్ హోస్టెస్ కావాలనే కోరిక నుంచి ట్రక్ డ్రైవర్‌గా మారిన ఆమె ప్రయాణం.. మనకు నచ్చిన పనిని ఎంచుకుంటే కెరీర్ కూడా మన జీవితంలోనే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుచేస్తుంది.


