స్మార్ట్ డివైజ్‌ల కంపెనీ నథింగ్ తమ అనుబంధ సంస్థ సీఎంఎఫ్‌ని విడదీసి పూర్తి స్థాయి స్టాండెలోన్ భారతీయ కంపెనీగా రిజిస్టర్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో మెజారిటీ షేర్‌హోల్డర్లు భారతీయులే ఉంటారని సంస్థ సీఈవో కార్ల్ పే వెల్లడించారు.
నథింగ్‌లో భాగమైన సీఎంఎఫ్ అందుబాటు ధరలో, మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తోంది. త్వరలో భారత్ ప్రధాన కేంద్రంగా ఈ కంపెనీ తన సొంత టీమ్, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలు సాగిస్తుందని కార్ల్ తెలిపారు. ఇందులో నథింగ్ సంస్థ షేర్‌హోల్డరుగా, భాగస్వామిగా కొనసాగుతుందని వివరించారు. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ని స్థాపించిన కార్ల్ .. ఆ తర్వాత దాన్నుంచి వైదొలిగి 2020లో నథింగ్ పేరిట స్మార్ట్ డివైజ్‌ల బ్రాండ్‌ను ఏర్పాటు చేశారు.
లండన్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ఏడాది క్రితం భారత్‌లో ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఆప్టీమస్ ఇన్‌ఫ్రాకామ్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇరు సంస్థలు 100 మిలియన్ డాలర్లపైగా (అప్పటి రూపాయి మారకం విలువ ప్రకారం సుమారు రూ. 887 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించాయి. 2028 నాటికి ఇది 1,800 ఉద్యోగాలు కల్పిస్తుందనే అంచనాలు ఉన్నాయి.


