కుప్పంలో ఏకంగా 106 ఎకరాల భూమి కేటాయింపు
ఇది చాలదన్నట్లు రూ.461 కోట్ల ప్రోత్సాహకాలు
రెండు నెలల క్రితం బెంగళూరు కేంద్రంగా ఎవర్నో ప్యానల్స్ ఏర్పాటు
కుప్పం గూడుపల్లె వద్ద వుడ్ ప్యానల్ తయారీ యూనిట్ ప్రతిపాదన
350 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన కంపెనీ ప్రతినిధులు
ఎలాంటి అనుభవం లేని ఈ కంపెనీకి సర్కారు భారీ నజరానాలు
ఇవన్నీ సకాలంలో అందేలా ఓ సీనియర్ అధికారి నియామకం
సాక్షి, అమరావతి : రెండు నెలల క్రితం కోటి రూపాయలతో పెట్టిన కంపెనీకి 106 ఎకరాలు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.461 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ఉత్తర్వుల మీద ఉత్తర్వులు ఇచ్చేస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం వేదిక కావడం గమనార్హం. రూ.1,137.58 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉపాధి కల్పించేలా వుడ్ ప్యానల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎవర్నో ప్యానల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ఈ ఏడాది ఏప్రిల్ 25న బెంగళూరు కేంద్రంగా కోటి రూపాయల చెల్లింపు ధనంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సాగిల పడుతోంది. వుడ్ ప్యానల్స్ తయారీలో ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం లేదు. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా తెలుగు రాష్ట్రానికి చెందిన బడతల శ్రీనివాసరావు, కర్ణాటకకు చెందిన అమీత్ గంజన్ హెగ్డే, మరో వ్యక్తి కనహైలాల్ చున్నీలాల్ చందక్‌లు ఉన్నారు. యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన బడతల శ్రీనివాసరావు.. అమీత్ గంజన్ హెగ్డేతో కలిసి గతేడాది జూన్ 17న బెంగళూరు కేంద్రంగా లక్ష రూపాయలతో ఇండిప్యానల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పొగాకు ఉత్పత్తుల సంస్థను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు కేవలం కోటి రూపాయల మూల ధనంతో ఎవర్నో ప్యానల్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి కుప్పంలో విలువైన భూములతో పాటు వందల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతుండటం చర్చ నీయాంశమైంది. ఈ క్రమంలో అన్ని అనుమతులు, రాయితీలు సత్వరమే అందేలా పర్యవేక్షణకు ఒక సీనియర్ అధికారిని నియమించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం విస్తుగొలుపుతోంది.
ఎస్‌ఐపీబీ ముందుకు రెండు నెలల్లో రెండుసార్లు
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసిన ఎవర్నో ప్యానల్స్ కంపెనీ ప్రతిపాదనను జూన్ 18న జరిగిన ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్) సమావేశంలో ఆమోదించడమే కాకుండా కుప్పం శాంతిపురం మండలం గుడుపల్లె వద్ద 106 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ వెంటనే అదే నెల 28న భూమిని కేటాయిస్తూ జీవో ఎంఎస్ నంబర్ 155 జారీ చేసింది. దీంతోపాటు విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ వెంటనే జూలై 7వ తేదీన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.461 కోట్ల విలువైన టైలర్ మేడ్ రాయితీలకు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం, మూడు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిపోయింది.
మొత్తం పెట్టుబడిలో 45.70 శాతం రాయితీల రూపంలో తిరిగి వెనక్కు ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే తీరులో దుబాయ్‌కి చెందిన ఎస్‌ఏఎఫ్ వన్ ఇండియా కంపెనీకి గత నెలలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాల భూమిని కేటాయించగా, ఇప్పుడు అదే కంపెనీకి రూ.617.23 కోట్ల రాయితీలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సిటీలో మాండలీజ్ (క్యాడబరీ చాక్లెట్స్) సంస్థ రూ.1,801 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులకు రూ.565.88 కోట్ల రాయితీలను ఇస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.


