చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం
ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు?
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై దౌర్జన్యం దుర్మార్గం
చంద్రబాబు సర్కారు సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నా
పోలీసులను మోహరించి పొలాల్లోకి బుల్డోజర్లతో దూసుకెళ్లి పంటలను ధ్వంసం చేస్తారా?
రైతులను బలవంతంగా ఈడ్చిపారేసి భూములను స్వా«దీనం చేసుకోవడం దారుణం
రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను తక్షణమే నిలిపివేయాలి
రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు సర్కార్ సాగించిన దౌర్జన్యకాండపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా.. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను కనీసం పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసులను మోహరించి.. బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి.. సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడ్డారు.
రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి.. భయభ్రాంతులకు గురిచేసి.. భూములను స్వా«దీనం చేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వా«దీనం చేసుకోవడం సరికాదని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
⇒ అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. అయినా వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వా«దీనం చేసుకోవడం దారుణం.
⇒ బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు ‘మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?’ అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
⇒ రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచి్చన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వా«దీనం చేసుకోవడం న్యాయమేనా?
⇒ ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములివి. మార్కెట్లో భారీ ధరలు పలికే ఈ భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబి్ధదారులు రైతులా? లేక చంద్రబాబు అస్మదీయులా?
⇒ రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బ తీస్తామంటే సహించేది లేదు. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చి పారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
⇒ ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు గారూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.


