పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్‌ రావు కన్నుమూత | Former PCC president GS Rao passes away | Sakshi
Sakshi News home page

పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్‌ రావు కన్నుమూత

Jul 12 2026 4:56 AM | Updated on Jul 12 2026 4:57 AM

Former PCC president GS Rao passes away

ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా, కాపునాడు అధ్యక్షుడిగా సేవలు 

దివంగత ముఖ్యమంత్రి  వైఎస్సార్‌తో అనుబంధం 

వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా రాణింపు 

నిడదవోలు/సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ కమిటీ మాజీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాపునాడు మాజీ అధ్యక్షుడు జీఎస్‌ రావు (90) వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన గెడ్డం సీతన్న, బుల్లమ్మ దంపతులకు ఆయన ఆరో సంతానం. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి 1962లో స్టూడెంట్‌ నేతగా ఎన్నికయ్యారు. ఆగ్రాలో ఎంఏ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. 

1968లో వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూనే సమాజ సేవ వైపు దృష్టి సారించారు. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1982లో అప్పుడే ఏర్పాటైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘానికి జాయింట్‌ కన్వీనర్‌గా పని చేశారు. అనంతరం ఈ సంఘం కాపునాడుగా రూపాంతరం చెందింది. 1988లో వంగవీటి మోహన రంగాను ముఖ్య అతిథిగా పిలిపించి భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించారు. 1991లో కాపునాడు అధ్యక్షుడిగా విశేష సేవలందించారు. 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

కొవ్వూరు నుంచి కాంగ్రెస్‌ అభ్య ర్థిగా ఓటమి ఎదురైనా, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో సత్తా చాటారు.  2000లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, 2003లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డితో మంచి సాన్నిహిత్యం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కొత్తగా ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ నాయుడును కాంగ్రెస్‌ అభ్య ర్థిగా బరిలోకి దించారు. 

2014లో వైఎస్సార్‌సీపీలో చేరారు. సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడు జి.శ్రీనివాస్‌ నాయుడును నిడదవోలు (ప్రస్తుతం ఈ నియోజకవర్గం సమన్వయకర్త) వైఎస్సార్‌సీపీ అభ్య ర్థిగా నిలిపి గెలిపించుకున్నారు. కాగా, జీఎస్‌ రావుకు భార్య వెంకటలక్ష్మి, మరో కుమారుడు జి.సీతారామ్, కుమార్తె డాక్టర్‌ పద్మ ఉన్నారు.

జీఎస్‌ రావు సేవలు చిరస్మరణీయం
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం 
కుమారుడు జి.శ్రీనివాస్‌ నాయుడికి ఫోన్‌లో పరామర్శ 
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీఎస్‌.రావు మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జీఎస్‌.రావు కన్ను మూయడం బాధాకరమని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో జీఎస్‌.రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకున్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని అన్నారు. జీఎస్‌.రావు మరణం రాజకీయ రంగానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రా ర్థిస్తున్నానన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement