నీవు లేకుండా ఉండలేనమ్మా.. | - | Sakshi
Sakshi News home page

నీవు లేకుండా ఉండలేనమ్మా..

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

అనారోగ్యంతో తల్లి మృతి

ఆ వార్త విని ఆగిన కుమారుడి గుండె

ఆత్రేయపురం: ఆ తల్లీకుమారులు ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. స్నేహితుల మాదిరిగా జీవించేవారు. ఈ క్రమంలో అనారోగ్యంతో తల్లి మృతి చెందగా, ఆ వార్త విని కుమారుడి గుండె ఆగిపోయింది. గంట వ్యవధిలో తల్లీకుమారులు మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాద ఘటన శుక్రవారం ర్యాలీ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన చిట్టూరి అపర్ణ (45)కు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో రావులపాలెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకువెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరే లోపు ఆమె మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ వార్త తెలియగానే ఆమె పెద్ద కుమారుడు సతీష్‌ గుప్తా (18) తీవ్ర ఆవేదనకు లోనై గుండెపోటుతో మృతి చెందాడు. కాగా.. అపర్ణ భర్త చిట్టూరి వీరభద్రం కరోనా సమయంలో మృతి చెందారు. ఆమె ఎంబ్రాయిడరీ పనులు చేసుకుంటూ, ఇంటి వద్ద పిండి మరను నడుపుతూ జీవిస్తున్నారు. ఆమె పెద్ద కుమారుడు సతీష్‌ గుప్తా పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. చిన్న కుమారుడు రాజేష్‌ గుప్తా రాజమహేంద్రవరంలో ఒక ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాజేష్‌ గుప్తాను వరసకు తాత అయిన ర్యాలి గ్రామానికి చెందిన చిట్టూరి రామచంద్రరావు దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం లొల్ల నుంచి గతంలోనే ఇక్కడికి వచ్చి స్థి రపడింది. కాగా.. తల్లి, అన్నయ్య అంత్యక్రియలను రాజేష్‌ గుప్తా నిర్వహించాడు.

పొగాకు బేళ్ల అక్రమ రవాణా

దేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని గోపాలపురం, కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు అక్రమంగా తరలిస్తున్న పొగాకు బేళ్లను బోర్డు విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ వివరాలను బోర్డు రీజినల్‌ మేనేజర్‌ జె.సురేంద్ర కుమార్‌ శనివారం విలేకర్లకు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం రాత్రి విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టి, అనుమానాస్పదంగా వెళుతున్న రెండు వ్యాన్లను గమనించారు. వాటిలో 28 హైగ్రేడ్‌ పొగాకు బేళ్లను ఎటువంటి అనుమతులు (పర్మి ట్లు) లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. బేళ్లలోని సుమారు 2100 కిలోల పొగాకును సీజ్‌ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం సీజ్‌ చేసిన పొగాకును జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి తరలించారు. ఈ దాడిలో పొగాకు బోర్డు విజిలెన్స్‌ అధికారి జీఎం కిరణ్‌, సాయి ప్రశాంత్‌, ధర్మతేజ పాల్గొన్నారు. కాగా. సురేంద్ర కుమార్‌ మాట్లాడుతూ నిబంధనలను ఉల్లఘించి అక్రమంగా పొగాకును తరలించడం నేరమని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే ఓఎస్‌డీ విజిలెన్స్‌ గుంటూరు 91540 30702, విజిలెన్స్‌ జంగారెడ్డిగూడెం 98497 77055కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామన్నారు. రైతులు తమ పొగాకు బేళ్లను వేలం కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement