ఫ సీపీఆర్‌తో ప్రాణ రక్షణ
ఫ గుండెపోటుపై అవగాహన అవసరం
కపిలేశ్వరపురం: కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ఎస్‌జే బాషా విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 9న తిరుపతికి ఎక్స్‌ప్రెస్ బస్సును నడుపుతున్నారు. దారిలో ఆయనకు ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. కండక్టర్ బాషా వెంటనే స్పందించి కార్డియో పల్మనరీ రెససిటేషన్ (సీపీఆర్) చేయడంతో ప్రాణం నిలిచింది. సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండటం ద్వారా గుండెపోటుకు గురైన వారిని ఆస్పత్రికి తరలించే లోపు ప్రాణాలతో కాపాడవచ్చు. గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు, ఊపిరితిత్తులు శ్వాస తీసుకోని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే సీపీఆర్ చేయాలి. అవి ఉన్నప్పడు సీపీఆర్ అవసరం లేదు సురక్షితంగా ఆసుపత్రికి తరలించవచ్చు. సీపీఆర్ పక్రియను నేర్చుకునేందుకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం సామాజిక బాధ్యత అవుతుంది. అంగర పీహెచ్‌సీ ఎంఎల్‌హెచ్‌పీ నేతల దేవి సీపీఆర్‌పై ప్రత్యేక శిక్షణ పొంది కళాశాలలు, సామాజిక కూడళ్లలో అవగాహన కల్పిస్తున్నారు.
లక్షణాలివే..
● గుండె కొట్టుకోవడం ఆగిపోతే శరీరానికి రక్తప్రసరణ ఆగిపోయి అవయవాలకు ప్రాణవాయువు సరఫరా ఆగిపోతుంది. అవయవాల్లో ఉత్పత్తి అయిన బొగ్గు పులుసు వాయువు రక్తం నుంచి విసర్జించక పోవడంతో శరీరంలో కదలికలు ఆగిపోతాయి. వెంటనే సీపీఆర్ చేస్తే ఫలితం ఉటుంది.
● అత్యంత సున్నితమైన మెదడుకు ఆక్సిజన్ అందకపోతే అది ఎక్కువ సేపు పనిచేయదు. ఆక్సిజన్ పునరుద్ధరణకై వెంటనే సీపీఆర్ చేయాలి. అలా చేయగలిగినప్పుడు సహజంగా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పటికీ కృత్రిమంగా గుండె నుంచి రక్తం మెదడుతో పాటు అన్ని అవయవాలకు ప్రసరిస్తుంది.
● సీపీఆర్ ఆలస్యంగా ప్రారంభిస్తే తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ అప్పటికే మెదడు పాడైపోతుంది. తిరిగి మెదడు కోలుకోవడం కష్టమవుతుంది.
● గుండెపోటుకు గురైన వ్యక్తిని సురక్షిత వాతావరణంలో ఉంచాలి. పల్స్, శ్వాస ఉందా లేదా అని చూడాలి. అవి లేకపోతే, ఛాతీ కుదపడం ప్రారంభించాలి. తక్షణమే నోటి ద్వారా శ్వాసను ఇవ్వడం, గుండైపె నొక్కడం చేయాలి. రెండు రెస్క్యూ శ్వాసలను ఇచ్చే ముందు 30 ఛాతీపై కుదుపులతో సీపీఆర్‌ను ప్రారంభించాలి. దాని వల్ల శరీరంలో నిలిచిపోయిన రక్తం, ఆక్సిజన్ సరఫరా తిరిగి ప్రవహించి గుండె కొట్టుకోవడం మొదలవుతుంది.
జాగ్రత్తలు తప్పనిసరి
గుండెపోటుకు గురైనప్పటికీ బాధితుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నా, గుండె కొట్టుకుంటున్నా సీపీఆర్ చేయకూడదు. ఆ రెండూ లేనప్పుడు వైద్యసాయం అందే వరకూ సీపీఆర్ చేస్తూ ఉండాలి. ఛాతీపై నొక్కేటప్పుడు గాయాలు కాకుండా, పక్కటెముకలపై ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడాలి. ప్రారంభించే ముందు ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవహించేందుకు వీలుగా ఆ వ్యక్తి తలను వెనుకకు వంచి గడ్డం పైకి లేపాలి. – నేతల దేవి
ఉమ్మడి జిల్లాలో..
ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఓ ఆసుపత్రి వైద్యుడు అందే వీవీవీఎస్ తాతారావు (56) (నిడదవోలు) కారులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఏడాది మే 27న చింతల నానిబాబు (46) (రాజవొమ్మంగి పీహెచ్‌సీ ఎంపీహెచ్‌ఎం) గుండెపోటుతో మరణించారు. అదే నెల 31న లైన్‌మన్ వాడపర్తి సూర్య భాస్కరమూర్తి (35) (పెద్దాపురం మండలం జి. రాగంపేట) విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. 2025 జూలై 31న నవ వధువు రమాదేవి (రాజవొమ్మంగి మండలం గడుఓకుర్తి) గుండె నొప్పితో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. గుండె పోటు రాగానే అవగాహనతో సీపీఆర్ చేస్తే బతికించే అవకాశం ఉంటుంది.


