ఫ బైక్ అదుపుతప్పి బాలుడి మృతి
ఫ కళాశాలకు వెళుతుండగా ఘటన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆ బైక్ ఖరీదు రూ.4.50 లక్షలు. దానిపై 17 ఏళ్ల మైనర్ బాలుడు శనివారం ఉదయం జాతీయ రహదారిపై దూసుకుపోతున్నాడు. దారిలో బస్సును తప్పించబోయి ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బత్తిన వెంకట సుదేంద్ర యోగేష్ (17) రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటికి కళాశాల దూరం కావడంతో రాజమహేంద్రవరంలోని ఆల్‌బ్యాంక్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆ బాలుడు ఉదయం ఇంటి నుంచి మేనమామకు చెందిన ఖరీదైన బైక్‌పై కళాశాలకు బయలుదేరాడు. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న అతడికి డెల్టా ఆస్పత్రి సమీపంలో రెండు స్కూల్ బస్సులు వెళుతూ కనిపించాయి. వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో బైక్ ఎడమవైపు హ్యాండిల్ ఓ స్కూలు బస్సుకు తగిలి కిందపడిపోయాడు. బైక్‌ను బస్సు కొంతమేర ఈడ్చుకుపోవడంతో యోగేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా.. యోగేష్ హెల్మెట్ ధరించడంతో తలకు గాయం కాలేదు. కానీ బస్సు ఈడ్చుకుపోవడంతో వీపు భాగానికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


