సఖినేటిపల్లి: ఆలయాల్లో అమ్మవార్ల మెడలోని మంగళ సూత్రాలను దొంగిలించిన నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి, అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 26న కేశవదాసుపాలెంలోని ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల్లో అమ్మవారి మంగళ సూత్రాలు చోరీకి గురైనట్టు ఆ ఆలయాల కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తపేట డీఎస్పీ ఆదేశాలపై, రాజోలు సీఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడైన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నానికి చెందిన బొక్కా లోకేశ్వరరావును అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు 8.6 గ్రాముల బంగారు సూత్రాలు (రెండు జతలు) స్వాధీనం చేసుకుని, మోటారు సైకిల్‌ను సీజ్ చేశారు. నిందితుడిని రాజోలు జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు.


