● ఓటర్లకు, ఫారాలకు పొంతన లేని అంకెలు
● పరిశీలనకు మూడు రోజులే గడువు
● నత్తనడకన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్
● క్షేత్ర స్థాయి అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి
సాక్షి, రాజమహేంద్రవరం: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఓటర్ల పాలిట గుదిబండలా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నుంచి, డిజిటలైజేషన్ వరకు గందరోళంగా తయారైంది. పది రోజుల క్రితం ప్రారంభమైన కార్యక్రమం నత్త నడకన సాగుతోంది. నేటికీ కొన్ని గ్రామాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేపట్టకపోవడం గమనార్హం. అధికారులు మాత్రం వంద శాతం పూర్తయినట్టు కాకి లెక్కలు చెబుతున్నారు. ఈ పరిణామం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఓటర్లలో అగ్రహావేశాలు నింపుతోంది.
ఇంకా అందని ఎన్యూమరేషన్ ఫారాలు
సర్ గడువు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. 12వ తేదీ ఆదివారం సైతం పనిచేయాలని అధికారులకు ఆదేశాలందాయి. అయినా కొన్ని గ్రామాల్లో నేటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. జిల్లాలో కేవలం 98 శాతం మందికి మాత్రమే అందించగా, శుక్రవారానికి 83.38 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయడం గమనార్హం.
ప్రారంభం నుంచీ సతమతమే
● కోడళ్ల సమస్య జటిలంగా మారుతోంది. సుమారు 20 ఏళ్ల క్రితం వివాహాలు చేసుకుని జిల్లాకు వచ్చిన వారు తల్లి, తండ్రి ఓటరు కార్డు మ్యాపింగ్‌తో ఇబ్బంది పడుతున్నారు.
● 2002లో పుట్టిల్లు ఏ నియోజకవర్గంలో ఉందో తెలుసుకుని వారి తల్లిదండ్రుల ఓటరు కార్డు వివరాలను, పోలింగ్ కేంద్రం వివరాలను తెలియజేయడంలో ఆలస్యమవుతోంది.
● పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఫారాలు ఎక్కడ ఇవ్వాలో దిక్కుతోచని స్థితిలో బీఎల్‌ఓలు ఉన్నారు. కొందరివి బంధువుల ఇంటి వద్ద ఇస్తుండగా.. అడ్రస్‌లు పోలని వారి ఫారాలు మాత్రం వారి వద్దే ఉంటున్నాయి.
టీడీపీ నేతల రంగప్రవేశంతో గందరగోళం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీకి చెందిన బీఎల్‌ఏలు బీఎల్‌ఓలతో ఇంటింటికీ వెళ్తూ వైఎస్సార్ సీపీకి సానుభూతిపరుడని అనుమానం వచ్చిన వారి ఓట్లు తొలగించాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. ఎలాంటి పదవులూ లేకపోయినా.. కూటమి నేతలమంటూ బీఎల్‌ఓలు, పంచాయతీ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల్లో తిష్ట వేస్తున్నారు. బీఎల్‌ఓలు చేస్తున్న డేటాను పర్యవేక్షిస్తూ.. టీడీపీ యాప్‌లో నమోదు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. తమ అడుగులకు మడుగులొత్తకపోతే బదిలీ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. వారి వ్యవహార శైలితో అధికారులు, బీఎల్‌ఓలు విసుగెత్తిపోతున్నారు.
క్షేత్ర స్థాయి అధికారులపై ఒత్తిడి
తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ, విద్యా శాఖ అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ విధులతో సంబంధం లేని యానిమేటర్లు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లను సైతం సస్పెండ్ చేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమను కేవలం ఇళ్లకు వెళ్లి ఫారాలు తెచ్చి ఇవ్వమని అడిగారని, ఆ మేరకు ఇళ్లకు వెళ్లి.. వారిస్తే తీసుకొచ్చి కార్యదర్శులకు అందజేస్తున్నామని.. తమ బాధ్యత కాకపోయినా చేస్తున్నామని, అయినా తమపై టార్గెట్లు విధించడం ఏంటని యానిమేటర్లు ప్రశ్నిస్తున్నారు.
ఓటర్లూ.. స్వయంగా నిర్ధారించుకోండి
రాజమహేంద్రవరం రూరల్: ‘సర్’లో ప్రతి ఓటరూ చురుగ్గా పాల్గొని జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో స్వయంగా నిర్ధారించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. జిల్లాలో సర్ వేగంగా కొనసాగుతోందని బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేసి, వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 14తో ప్రత్యేక సవరణ ముగియనున్న నేపథ్యంలో మిగిలిన సమయం అత్యంత కీలకమని, ప్రతి ఓటరూ నిర్లిప్తత వీడి వెంటనే స్పందించాలని కోరారు.
ఇంటి నుంచే నమోదుకు అవకాశం
బీఎల్‌వోను నేరుగా కలిసే అవకాశం లేని ఓటర్లు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ‘బుక్ ఏ కాల్ టు బీఎల్‌వో ’ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


