రాజకీయ ధురంధరుడు జీఎస్‌ రావు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ ధురంధరుడు జీఎస్‌ రావు

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

నిడదవోలు/తాళ్లపూడి: కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ కమిటీ మాజీ సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ కాపునాడు అధ్యక్షుడు గెడ్డం సూర్యచంద్రరావు (జీఎస్‌ రావు) శనివారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జి. శ్రీనివాసనాయుడు తండ్రి జీఎస్‌ రావు తాళ్లపూడి మండలంలోని పెద్దేవంలో గెడ్డం శీతన్న, బుల్లెమ్మ దంపతులకు ఆరో సంతానం. తండ్రి శీతన్న గ్రామాభివృద్ధికి విశేషంగా సేవలందించారు. అదే వారసత్వంతో కాకినాడ పీఆర్‌ కళాశాలలో బీఏ చదివి, 1962లో విద్యార్థి నాయకుడిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆగ్రాలో ఎంఏ పూర్తి చేశారు. 1968 నుంచి అనేక వ్యాపార సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అనంతరం ఉస్మానియా వర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు.

కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా

కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి 1978లో కొవ్వూరు ఎమ్మెల్యేగా ఎంఏ అజీజ్‌ను గెలిపించడంలో ఈయన పాత్ర చిరస్మరణీయం. 1982లో మొట్టమెదటిగా ఏర్పాటు చేసిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘానికి ఆయన జాయింట్‌ కన్వీనర్‌గా పనిచేశారు. అనంతరం అది కాపునాడుగా రూపాంతరం చెంది 1988లో ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వంగవీటి మోహన రంగాను ముఖ్య అతిథిగా పిలిచి సభను విజయవంతం చేశారు. 1991లో జీఎస్‌ రావు కాపునాడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో సైతం కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. మహనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విజయవంతంగా నిర్వహించారు. అనంతరం 2009లో కొత్తగా ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు జి.శ్రీనివాస్‌ నాయుడుని కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ఆయన, వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు 2014లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. జగన్‌కు సన్నిహితునిగా ఉండి పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. 2019లో కుమారుడు శ్రీనివాసనాయుడు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు.

కుటుంబ విషయానికి వస్తే పెద్ద తనయుడు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు అందరికీ సుపరిచితుడు కాగా, రెండో కుమారుడు జి.సీతారామ్‌ హైటెక్‌ సీటీలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత ఉన్నారు. ఆయన కుమార్తె డాక్టర్‌ పద్మ వైద్య విద్యనభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. భార్య వెంకటలక్ష్మి జీఎస్‌ రావు లక్ష్య సాధనలో మమేకమయ్యారు. పెద్దేవంలో తన సొంత భూమిని ఉన్నత పాఠశాల నిర్మాణానికి విరాళంగా యిచ్చి తన సేవా భావాన్ని చాటుకున్నారు.

నేడు అంతిమయాత్ర

రాజమహేంద్రవరం రూరల్‌: జీఎస్‌ రావు మృతికి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం నిడదవోలులో ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంచుతారన్నారు. అంతిమయాత్ర తాళ్లపూడి మండలంలో ఆయన స్వగ్రామమైన పెద్దేవం వరకు సాగుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్టీ, కాపునాడులలో

చెరగని ముద్ర

నిడదవోలు మాజీ ఎమ్మెల్యే

శ్రీనివాసనాయుడు తండ్రి జీఎస్‌ రావు

దివంగత మహనేత వైఎస్సార్‌తో

సన్నిహిత అనుబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement