రాజధాని రైతులపై రాక్షసకాండను ఖండించిన వైఎస్ జగన్ | Ys Jagan Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

రాజధాని రైతులపై రాక్షసకాండను ఖండించిన వైఎస్ జగన్

Jul 11 2026 7:46 PM | Updated on Jul 11 2026 8:03 PM

Ys Jagan Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: రాజధాని రైతులపై రాక్షసకాండను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

‘‘రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?

..ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? చంద్రబాబుగారి అస్మదీయులా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలుస్తుంది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement