సాక్షి, తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు జి.శ్రీనివాస్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జీఎస్.రావు కన్నుమూయడం బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో జీఎస్ రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకున్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని అని ఆయన అన్నారు. జీఎస్‌రావు మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు. జీఎస్.రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


