సీఎం సొంత జిల్లాలో ఆయన కుటుంబ సంస్థే పేద రైతుల కడుపుకొడుతున్న వైనం
వెన్న శాతం తక్కువగా ఉన్న రోజుల్లో జీరో పేమెంట్
రైతులను మోసం చేస్తున్న వైనం
హెరిటేజ్ డెయిరీ ఎదుట ఆందోళనకు దిగిన పాడి రైతులు
జీరో పేమెంట్ అన్నప్పుడు పాలు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీత.. చేతులెత్తేసిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
గంగాధర నెల్లూరు: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పాడి రైతులకు ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్ శఠగోపం పెడుతోందని రైతులు భగ్గుమన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పెద్ద కాలువ పంచాయతీలోని హెరిటేజ్ డెయిరీ వద్ద పలువురు రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఇలాగైతే తామెలా బతకాలంటూ మేనేజర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హెరిటేజ్ సంస్థ డెయిరీకి పాలు పోస్తుంటే వెన్న శాతం తక్కువగా వస్తోందని చెబుతున్నారని, ఆయా రోజుల్లో పాలకు డబ్బులు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో పేమెంట్ కింద చేర్చి రెండేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గంగాధర నెల్లూరు మండలంలోని కలిజవేడు పంచాయితీ కె.నాసంపల్లి గ్రామంలో పలు కుటుంబాలు పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాయి. చాలా ఏళ్లుగా హెరిటేజ్ సంస్థకు పాలు పోస్తున్నారు. అయితే రెండేళ్లుగా వెన్న శాతం 8 కంటే తక్కువగా ఉన్న రోజుల్లో పోసిన పాలను జీరో పేమెంట్ కింద నమోదు చేసి డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవి అనే మహిళ హెరిటేజ్ డెయిరీకి సరఫరా చేసిన పాలల్లో దాదాపు 600 లీటర్లకు జీరో పేమెంట్ పడింది. దీంతో శనివారం ఆమె పలువురు రైతులతో కలిసి హెరిటేజ్ డెయిరీ వద్దకు వచ్చారు.
జీరో పేమెంట్ ఎలా వేస్తారని మేనేజర్‌ను ప్రశ్నించారు. ఆ సొమ్ము ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మేనేజర్ ధనుంజయులు స్పందిస్తూ.. సంస్థ పెద్దలతో చర్చించి ఏం చేస్తామన్నది తర్వాత చెబుతాము. అలాగని ఇప్పుడు ఏ హామీ మేము ఇవ్వలేము’ అని తెలిపారు. ఈ సమాధానంతో రైతులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఇది చాలా అన్యాయం
నాసంపల్లిలో మాకు 25 పాడి ఆవులు ఉండేవి. డెయిరీ ఫాం పెట్టుకున్నాం. ప్రసు్తతం ఖర్చులు ఎక్కువై 10 మాత్రమే ఉన్నాయి. మా డెయిరీ ఫాం నుంచి 20 ఏళ్లుగా హెరిటేజ్ సంస్థకు పాలు పోస్తున్నాం. రెండేళ్లుగా అప్పుడప్పుడు వెన్న శాతం తక్కువగా ఉందంటూ ఆ రోజు పోసిన పాలను మొత్తం జీరో కింద చూపిస్తున్నారు. ఇది అన్యాయమని పలుమార్లు సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – నీలావతి, మాజీ సర్పంచ్, కలిజవేడు పంచాయతీ
జీరో పేమెంట్ కింద చూపించడం దారుణం
హెరిటేజ్ సంస్థకు రోజూ 50–60 లీటర్ల పాలు పోస్తున్నాం. లీటరుకు రూ.35 నుంచి రూ.42 వరకు వస్తుంది. కానీ వెన్న శాతం తక్కువగా ఉందని నాకు దాదాపు 600 లీటర్ల వరకు డబ్బులు ఇవ్వకుండా జీరో పేమెంట్ అని పెట్టేశారు. అడిగితే ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. జీరో పేమెంట్ అన్నప్పుడు ఆ రోజున ఆ పాలు ఎందుకు వాడుకుంటున్నారు? – దేవి, నాశంపల్లి పాడి రైతు
ఈ తరహాలో ఎక్కడా జీరో పేమెంట్ లేదు
జిల్లాలో ఎక్కడా లేని పద్ధతిని హెరిటేజ్ తీసుకువచ్చింది. కచి్చతమైన పాల దిగుబడి అనేది మన చేతుల్లో ఉండదు. ఎండగా ఉంటే పాలల్లో వెన్న శాతం తక్కువవుతుంది. వెన్న 8 శాతం కంటే తక్కువగా ఉందని జీరో పేమెంట్ వేస్తున్నారు. అలాంటప్పుడు మా పాలు వాడుకోవడం ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా పాలను వాడుకున్నప్పుడు మా డబ్బులు చెల్లించాలి. ఈ విధానం మార్చుకోలేమంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – ప్రభాకర్ నాయుడు, డెయిరీ ఫాం నిర్వాహుకుడు, నాశంపల్లి


