ఖాకీ ప్రతిష్టకు పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ఖాకీ ప్రతిష్టకు పరీక్ష

Jul 12 2026 12:29 AM | Updated on Jul 12 2026 12:29 AM

శ్రీహరి మృతిలో పోలీస్‌ అధికారిపై ఆరోపణలు

మృతుడి శరీరంపై బలమైన గాయాలున్నా, కేసు నమోదు చేయని వైనం

నిందితుడ్ని కాపాడే ప్రయత్నాలు చేసిన అధికారి పాత్రపై విచారణ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జిల్లాలో పోలీస్‌ శాఖ రాజ్యాంగేతర శక్తిగా మారింది. తామేమి చేసినా.. చెల్లుబాటు అయిపోతుందనే ధీమాతో వ్యవహరిస్తోంది. చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే అందుకు భిన్నంగా చట్టాన్ని, న్యాయాన్ని సమాధి చేస్తున్నారనే ఆరోపణలతో ఆ శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. తాజాగా బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖాధికారి శ్రీహరి హత్య కేసును తారుమారు చేసి నిందితులను కాపాడేందుకు ఓ పోలీస్‌ అధికారి భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది. పక్కాగా చేసిన హత్యను గుండెపోటుగా చిత్రీకరణ చేయడంలో సదరు పోలీస్‌ అధికారి పాత్ర వెనుక రాజకీయ పార్టీ నేతలు ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. నిందితులు హత్యకు ముందుగానే అధికారితో రహస్య ఒప్పందం చేసుకుని పక్కా ప్లాన్‌ చేశారా? అనే సందేహాలకు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అద్దం పడుతున్నాయి.

అంతా అనుమానాస్పదమే

మృతదేహంపై బలమైన గాయాలున్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఫిర్యాదు లేదనే నెపంతో కేసు నమోదు చేయకపోవడంతో దర్యాప్తు తీరుపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయం, ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉన్నా.. సదరు పోలీస్‌ అధికారి దహనం చేయించడం, యూట్యూబ్‌ చానల్స్‌ వారిని పంపించి, కుటుంబ సభ్యుల తో శ్రీహరి గుండెపోటుతోనే మృతి చెందా డని ఇంటర్వ్యూలు తీసుకోవడం చూస్తే.. నేరాన్ని పక్కాగా సమాధి చేసే ఉద్దేశంగానే కనిపిస్తోంది. వాస్తవంగా ఎవరైనా గాయాలతో మృతి చెందితే.. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం చేయించి, ఆ రిపోర్టు ఆధారంగా కేసును మార్పు చేయాల్సి ఉంది. ఇది పోలీస్‌ ప్రాథమిక విధి. అయితే గుండెపోటుతో చనిపోయినట్లు చెబుతున్న వ్యక్తి ఒంటిపై గాయాలు, మెడ కమిలిపోయినట్లు కనిపిస్తున్నా.. కేసు నమోదు చేయకపోవడంపై సదరు పోలీస్‌ అధికార పాత్రపై ఆరోపణలు రావడంతో జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ‘సాక్షి’ కథనంతో ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని స్థానిక ఎమ్మెల్యే సైతం వెంటనే ఆ పోలీస్‌ అధికారిపై వేటు వేయమని ఆదేశించినట్లు సమాచారం. సదరు పోలీస్‌ అధికారికి ఎక్కడ పోస్టింగ్‌ వేసినా అతని వ్యవహార శైలి వివాదాస్పదమే. ఏ స్టేషన్‌లోనూ ఆరు నెలలకు మించి పనిచేయలేదని తెలుస్తోంది.

కేసుల తారుమారులో దిట్టలు

గడిచిన రెండేళ్లుగా జిల్లాలో పోలీసుల వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తున్నా.. ఇసుమంత కూడా మార్పురావడం లేదు. నేరస్తులను శిక్షించాల్సిన పోలీసులే నేరస్తులుగా, నేరస్తులకు రక్షణ కవచంగా మారుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. తాము తప్పు చేస్తున్నామనే భావన కూడా లేకుండా.. నేరస్తులను కాపాడుతున్నారు. 2024 జూన్‌ 12వ తేదీన అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ నేతల దాడుల ఘటన నుంచి.. మినగల్లు మర్డర్‌ వరకు పోలీసుల వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదంగా ఉన్నాయి.

● శంకరనగరంలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులు చేసి తలలు పగులగొడితే.. బాధితులనే నిందితులుగా మార్చేశారు. పోలీస్‌స్టేషన్‌ గడపే ఎక్కని బాధితులను ఏకంగా రౌడీలుగా మార్చేసి, వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేసిన ఘన చరిత్ర ఈ పోలీస్‌శాఖది.

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నుంచి జర్నలిస్టులు, సామాన్య కార్యకర్తలపైనా, నాయకులపైనా తప్పుడు కేసులు బనాయించి నెలల తరబడి జైళ్లల్లో మగ్గేలా చేశారు.

● కావలిలో గిరిజన మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి, దాడి చేసి.. నేటికి 24 రోజులు గడిచాయి. ఈ ఘటన జరిగిన తర్వాత కేసే లేకుండా చేసేందుకు నిందితుల పక్షాన నిలబడి వారం రోజులు అసలు కేసే నమోదు చేయలేదు. ఈ విష యం బయటకు పొక్కడంతో ఎట్టకేలకు వారం తర్వాత కేసు నమోదు చేసినా ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో ఈ కేసును నీరుగార్చేందుకు బాధితు రాలి కుమారుడిపైనా కౌంటర్‌ కేసును నమోదు చేశారు.

● తాజాగా మినగల్లుకు చెందిన శ్రీహరి మరణంపై అనేక అనుమానాలే కాకుండా.. భౌతికమైన గాయాలు ఉన్నా.. పోలీసులు హత్య కేసును గుండెపోటు మరణంగా మార్చేసి చేతులు దులుపుకొన్నారు.

బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖాధికారి శ్రీహరి మృతి కేసు దర్యాప్తులో పోలీసుల వ్యవహార శైలి.. ఖాకీ ప్రతిష్టకు మాయని మచ్చగా మారింది. ప్రాథమిక సమాచారంతో నిజానిజాలు వెలికి తీయాల్సిన ఖాకీ అధికారి నిందితులకు రక్షణ కవచంగా మారడంతో ఆ శాఖ ప్రతిష్టకు మరో పరీక్ష ఎదురైంది. మృతుడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు, దర్యాప్తు తీరుపై వ్యక్తమవుతున్న సందేహాలు పోలీస్‌ శాఖను ఇరకాటంలోకి నెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement