రాజీ మార్గమే లోక్‌అదాలత్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రాజీ మార్గమే లోక్‌అదాలత్‌ లక్ష్యం

Jul 12 2026 12:29 AM | Updated on Jul 12 2026 12:29 AM

నెల్లూరు (లీగల్‌): రాజీ మార్గమే లోక్‌అదాలత్‌ లక్ష్యమని, కక్షిదారులు రాజీపడొస్తే సత్వర న్యాయాన్ని అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్‌ను శనివారం నిర్వహించారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, కమిషనర్‌ నందన్‌, ఏఎస్పీ సౌజన్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయస్థానాలపై కేసుల భారం అధికంగా ఉండటంతో పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు. ఈ కారణంతో సమయం, ధనాన్ని కక్షిదారులు కోల్పోవాల్సి వస్తోందని, దీన్ని అధిగమించేందుకే జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నారని వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. కుటుంబ, ఆస్తి, సివిల్‌ వివాదాల పరిష్కారం న్యాయవ్యవస్థ ద్వారానే సాధ్యమవుతుందని, అలాంటి వివాదాలకు లోక్‌ అదాలత్‌ సమర్థమైన వేదికగా నిలుస్తోందని చెప్పారు. కాగా లోక్‌అదాలత్‌లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో 38,421 కేసులు పరిష్కారం కాగా, కక్షిదారులకు పరిహారంగా రూ.2,65,44,793ను చెల్లించారు. నగరంలో ఏర్పాటు చేసిన బెంచ్‌లకు న్యాయమూర్తులు శరత్‌బాబు, గీత, శుభవాణి, జిలానీబాషా, శైలజ, కరుణకుమార్‌, శ్రీనివాస్‌, భరద్వాజ, శారదరెడ్డి, అబ్దుల్‌ రెహమాన్‌, నిషాద్‌నాజ్‌, సులోచన, సాయిరామ్‌ ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించి 11,469 కేసులను పరిష్కరించారు. న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మశ్రీ పర్యవేక్షించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘రుణాల స్వాహాలో

ఉద్యాన శాఖకు సంబంధం లేదు’

ఉదయగిరి: జలదంకి ఉద్యాన రైతుల ఉత్పత్తిదారుల సంస్థలో కర్షకులకు తెలియకుండా నిధులు స్వాహా చేసిన వ్యవహారంతో తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని వింజమూరు ఉద్యానాధికారి షాహిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మూడు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్న నేపథ్యంలో ఉద్యాన రైతుల ఉత్పత్తిదారుల సంస్థను 2021లో ఏర్పాటు చేశారని చెప్పారు. దీని నిర్వహణ బాధ్యతను ఆ సంస్థకు చెందిన కమిటీ పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఈ సంస్థకు రుణాలిచ్చిన ఫైనాన్స్‌ సంస్థతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ అంశమై సంస్థ సీఈఓ ప్రభాకర్‌రెడ్డిని విచారించగా, కోవూరుకు చెందిన ఓ వ్యక్తి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో రైతులకు నోటీసులు జారీ చేశారనే విషయం తెలిసిందన్నారు. ఇది ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంస్థకు.. రుణాలు మంజూరు చేసిన బ్యాంక్‌కు సంబంధించింది మాత్రమేనన్నారు.

శ్రీవారి దర్శనానికి 30 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. పాచికాలవ గంగమ్మ గుడి వద్దకు చేరుకుంది. స్వామివారిని 73,265 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు లేని వారికి 30 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement