● న్యాయ విద్యార్థుల ఆవేదన
నెల్లూరు (టౌన్): సోష ల్ మీడియాలో న్యాయ విద్యార్థులు పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో వేలాది మంది స్టూడెంట్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తపర్చారు. గతేడాదిగా కోర్సులోని అన్ని సెమిస్టర్ పరీక్షల్లో 80 శాతం మందిని ఫెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక సబ్జెక్ట్‌లో చాలా మందికి ఒకే మార్కులొస్తున్నాయని అందులో పొందుపర్చారు. రీవాల్యుయేషన్‌కు ఫీజు చెల్లించినా, వర్సిటీ అధికారులు ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. స్క్రూట్నీ, రీకరక్షన్ సదుపాయాన్ని ఎందుకు కల్పించడంలేదన్నారు. వర్సిటీ అధికారులు చేసేది మూల్యాంకనం కాదని, తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌పై వెంటనే ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. నిజాయతీ, నిబద్ధతతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి తమ భవిష్యత్తుకు బాటలేయాలని విజ్ఞప్తి చేశారు.


