డీఎస్‌డీఓ పోస్టింగ్‌తో బంతాట | - | Sakshi
Sakshi News home page

డీఎస్‌డీఓ పోస్టింగ్‌తో బంతాట

Jul 12 2026 12:29 AM | Updated on Jul 12 2026 12:29 AM

జసీమ్‌ రాజీనామాతో

పాండుకు ఇన్‌చార్జి బాధ్యతలు

అయిష్టంగా బాధ్యతలు

స్వీకరించిన వైనం

గతంలో ఆయనకు ఇచ్చిన

ఐదు నెలలకే రాజీనామా

నెల్లూరు (టౌన్‌): జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) పోస్టుపై బంతాట సాగుతోంది. ఇక్కడ డీఎస్‌డీఓగా ఉండేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బలవంతంగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పినా ఒత్తిళ్లను భరించలేక నాలుగైదు నెలలకే రాజీనామాలు చేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర శాప్‌ నుంచి నిధులు రాకపోవడం, స్టేడియం, క్రీడాపోటీల నిర్వహణకు ఎవరో ఒకరు మీద ఆధార పడాల్సి ఉండటంతో డీఎస్‌డీఓ పోస్టును స్వీకరించేందుకు భయపడే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు క్రీడాప్రాధికార సంస్థలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కలెక్టర్‌ అనుమతి తీసుకోవాల్సి వస్తుండటంతో ఈ పోస్టు మాకొద్దంటూ వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. అన్ని క్రీడలకు కోచ్‌లు లేకపోవడం, జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో ఎక్కువ మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉండడం, వారికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో సిబ్బంది డీఎస్‌డీఓ మాటే లెక్కచేయకపోతుండటంతో స్టేడియం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా పాండు శుక్రవారం రాత్రి మళ్లీ ఇన్‌చార్జి డీఎస్‌డీఓగా బాధ్యతలు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది.

ఎంత కాలం కొనసాగుతారో..

ప్రస్తుతం డీఎస్‌డీఓగా పనిచేస్తున్న జసీమ్‌ రాజీనామా చేశారు. ఈనెల 15 నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతుండటంతో హుటాహుటిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా పాండుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో డీఎస్‌డీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న యతిరాజు గతేడాది అక్టోబర్‌లో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని పాండును రెగ్యులర్‌ డీఎస్‌డీఓగా నియమించారు. అయితే ఆయన ఐదు నెలలు తర్వాత రాజీనామా చేశారు. దీంతో అథ్లెటిక్‌ కోచ్‌ జసీమ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన కూడా మూడు నెలల పాటు విధులు నిర్వహించి మెడికల్‌ గ్రౌండ్స్‌ పేరుతో రాజీనామా చేశారు. దీంతో అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలు దగ్గర పడుతుండటంతో హుటావుటిన పాండుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన అయిష్టంతో బాధ్యత స్వీకరించినట్లు తెలిసింది. నిధుల లేమి, పైఅధికారుల ఒత్తిడి, స్టేడియం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం తదితర కారణాలతో డీఎస్‌డీఓ పోస్టును స్వీకరించేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీల తరువాత అయినా రెగ్యులర్‌ డీఎస్‌డీఓగా ఎవరైనా వస్తారో.. లేక వీళ్లనే బలవంతంగా కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

15 నుంచి చాంపియన్‌షిప్‌ పోటీలు

అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీలు ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర శాప్‌ నుంచి జిల్లా క్రీడాభివృద్ధి అధికారులకు ఆదేశాలు అందాయి. మొత్తం 12 రకాల క్రీడా పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. తొలుత జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించి, అక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపిక చేయనున్నారు. జిల్లాలో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement