నెల్లూరు రూరల్: సర్ ప్రక్రియలో నగరంలో జరుగుతున్న అవకతవకలు.. ఎన్నికల ప్రాసెస్‌లో రాజకీయ పార్టీల జోక్యం.. ప్రభుత్వ యంత్రాంగ వ్యవహార శైలి.. పెన్నాలో ఇసుక అక్రమ తవ్వకాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో సాక్షితో శనివారం ఆయన మాట్లాడారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వాలని మంత్రి నారాయణకు సవాల్ విసిరారు. వీటికి ఆన్సర్లు చెప్పకుండా, టీడీపీ నేతలతో ప్రెస్‌మీట్ పెట్టించి వ్యక్తిగత విమర్శలు చేయించడం తగదని హితవు పలికారు. ఈ నెల 14లోపు ఎన్యూమరేషన్ ఫారాలు అప్‌లోడ్ కాకపోతే, ముసాయిదా జాబితాలో సదరు ఓటర్ల వివరాలుండవని అధికారులే చెప్తున్నారని, దీన్ని ఓట్ల తొలగింపుగా ఎందుకు భావించకూడదని ప్రశ్నించారు. ఎన్యూమరేషన్ ఫారాలను టీడీపీ బీఎల్‌ఏలకు బీఎల్వోలు ఇస్తున్నారనే అంశాన్ని తాను లేవనెత్తానని వివరించారు. ఆ రోజు విడుదల చేసిన వివరాల్లో 99 శాతం ఫారాలను పంపిణీ చేశారని పేర్కొని, 40 శాతం మాత్రమే అప్‌లోడ్ అయ్యాయని చూపించారన్నారు. దీనిపై సమాధానం చెప్పకుండా, ఐదు రోజుల తర్వాత 70 శాతం అప్‌లోడ్ అయ్యాయని తెలియజేయడం అసలు సమస్యను పక్కదారి పట్టించడమేనని చెప్పారు. రామ్మూర్తినగర్‌లో ఒకే డోర్ నంబర్‌పై 28 ఓట్లున్నాయని టీడీపీ నేతలతో చెప్పించారని.. కార్పొరేషన్లో గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారికి ఇది తెలియకుండా ఎలా జరిగిందని ప్రశ్నించారు.
పోటీ చేసి గెలవడమే అసలైన అనుభవం
తనకు రాజకీయ అనుభవం లేదని చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, బెదిరింపులకు దిగడం కాదని.. ప్రజల మధ్య నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి గెలవడమే నిజమైన రాజకీయ అనుభవమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు పార్లమెంట్.. 36 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 175 మండలాల పరిధిలో ఎలక్షన్ నిర్వహణ బాధ్యతలు చేపట్టి, అనుభవజ్ఞులైన ప్రత్యర్థులను ఓడించి విజయం సాధించిన అంశాన్ని గుర్తుచేశారు. రెడ్‌క్రాస్ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు.
టీడీపీ టెంట్లలో ఎందుకు..?
47వ డివిజన్లో టీడీపీ టెంట్లలో బీఎల్వోలు ఎందుకున్నారని ప్రశ్నించారు. వీరితో సమన్వయం కోసం అన్ని పార్టీల బీఎల్‌ఏలు వెళ్లడం సహజమేనని, అయితే ప్రభుత్వాధికారులు రాజకీయ పార్టీ టెంట్లలో ఎందుకున్నారని నిలదీశారు. 238వ బూత్‌కు సంబంధించిన సూపర్‌వైజర్ తనకు ఫోన్ చేసి 240 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారని, అయితే కమిషనర్ విడుదల చేసిన అధికారిక వివరాల్లో కేవలం నాలుగే పెండింగ్‌లో ఉన్నాయని చూపించారని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలపై సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య, వారి పాత్రపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం మంత్రికి తగదన్నారు.
‘సర్’ ప్రక్రియ
పారదర్శకంగా జరుగుతోందా..?
వాస్తవ సంఖ్యకు.. వివరాలకు మధ్య వ్యత్యాసం
మంత్రి నారాయణపై ధ్వజమెత్తిన పర్వతరెడ్డి
పెన్నాలో అక్రమ
తవ్వకాలపై వివరణివ్వాలి
ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉన్నా, పెన్నాలో ఇసుక తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని ఆధారాలతో చెప్పామని తెలిపారు. దీనిపై మాట్లాడకుండా, ఇసుకను తక్కువ ధరకే విక్రయిస్తున్నామని చెప్పడం అసలు అంశాన్ని పక్కదారి పట్టించడమేనన్నారు. వాస్తవాలను ప్రశ్నించిన ప్రతిసారి వ్యక్తిగత విమర్శలు చేయించడం, తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకోవడం మంత్రి నారాయణకు తగదని హితవు పలికారు.


