సాక్షిప్రతినిధి, నెల్లూరు: నిబంధనలను తుంగలో తొక్కి జిల్లాలో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. వర్షాకాలంలో నిషేధమున్నా, చట్టం మా చుట్టం అనే రీతిలో మంత్రి నారాయణ అనుచరులు అడ్డగోలుగా.. నదుల్లో ఇసుకను దోపిడీ చేస్తున్నారు. అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తుతున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్, పోలీస్, రెవెన్యూ అఽధికారులు కళ్లకు గంతలు కట్టుకొని తమకేమీ పట్టదనే రీతిలో వ్యవహరిస్తున్నారు.
అంతా బహిరంగమే
పల్లిపాడు, అప్పారావుపాళెం, విరువూరు ఇలా అనేక ప్రాంతాల నుంచి పెన్నాలో ఇసుకను మంత్రి నారాయణ అనుచరులు బహిరంగంగా తవ్వుకుంటున్నారు. జేసీబీలతో తవ్వేస్తూ.. ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. రాత్రి వేళ లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. ఇదే అంశమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది.
పర్మిషన్లు వారికి అక్కర్లేదంట..!
వాస్తవానికి ఇసుకను రవాణా చేయాలంటే ట్రాన్సిట్ పర్మిషన్ తప్పనిసరి. అలాంటివి తమకు కాదంటూ మంత్రి నారాయణ అనుచరులు కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో దోపిడీని అరికట్టలేక అధికారులు చేతులెత్తేశారు. ఆవైపు కన్నెత్తి చూడాలన్నా హడలిపోతున్నారు. ఈ దోపిడీ ఆగేదెప్పుడో.. ఆపేవారెవరోనంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
నదుల్లో ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం.. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 15 వరకు నదుల్లో తవ్వకాలను నిషేధించింది. ఈ సమయంలో అక్కడ్నుంచి రవాణాకూ అనుమతి లేదు. ఈ మేరకు పెన్నాలో తవ్వకాలు, రవాణాను నిషేధిస్తూ జిల్లా మైనింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల వారికి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ సమయంలో ఇసుక అవసరమైతే స్టాక్ పాయింట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఇలా పెన్నా తీరంలోని పోతిరెడ్డిపాళెం, సంగం, సూరాయపాళెం, అప్పారావుపాళెం, విరువూరు, వెంకటాచలంలోని యార్డుల నుంచి కొనే వెసులుబాటుంది. అయితే వీటిని పట్టించుకోకుండా అక్రమార్కులు తవ్వి బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ లాంటి నగరాలకు తరలించి భారీగా ఆర్జిస్తున్నారు.
దోపిడీ ఆగేదెప్పుడో..?
గత నెల ఒకటి నుంచి నదుల్లో తవ్వకాలపై నిషేధం
అయినా ఆగని బరితెగింపు
రెచ్చిపోతున్న మంత్రి నారాయణ అనుచరులు
నిషేధమున్నా.. లెక్కేదీ..?


