ల్యాప్‌‘టాప్‌’గా దోపిడీకి స్కెచ్‌ | Rs 112 crore scam in Chandrababu Naidu coalition govt in laptops to Students | Sakshi
Sakshi News home page

ల్యాప్‌‘టాప్‌’గా దోపిడీకి స్కెచ్‌

Jul 12 2026 4:58 AM | Updated on Jul 12 2026 4:58 AM

Rs 112 crore scam in Chandrababu Naidu coalition govt in laptops to Students

చంద్రబాబు కూటమి సర్కారులో రూ.112 కోట్ల స్కామ్‌కు తెరతీత

3,500 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ల కోసం 27,672 ల్యాప్‌టాప్‌ల సేకరణ.. జీఈఎం ద్వారా మార్చి 19న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ

అస్మదీయులు మాత్రమే టెండర్‌కు అర్హత సాధించేలా నిబంధనల్లో మార్పు

మేకిన్‌ ఇండియా స్ఫూర్తి.. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలు తుంగలోకి

రూ.246.39 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన శాన్‌బే నెట్‌ వర్క్స్‌

రూ.254.02 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–2గా నిలిచిన సెల్‌కాన్‌ ఇంపెక్స్‌

శాన్‌బే 70 శాతం, సెల్‌కాన్‌కు 30 శాతం ల్యాప్‌టాప్‌లు సరఫరా చేసేలా ఒప్పందం

సరఫరా సంస్థలు కుమ్మక్కయ్యాయనడానికి ఇదే ఆధారమంటున్న నిపుణులు

ఒక్కో ల్యాప్‌టాప్‌ ఏకంగా రూ.89,042 చొప్పున కొనుగోలు

బహిరంగ మార్కెట్‌లో వాటి ధర రూ.43–45 వేలు మాత్రమే

సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాలేషన్‌కు మరో రూ.5–6 వేలు అనుకున్నా మొత్తంగా రూ.48–50 వేలే

దీన్ని బట్టి ఒక్కో ల్యాప్‌టాప్‌పై రూ.38,500 నుంచి రూ.40,500 ధర అధికం  

ఫలితంగా రూ.106.53 కోట్ల నుంచి రూ.112.07 కోట్ల మేర అస్మదీయులకు ప్రయోజనం

ఈ మొత్తాన్ని నీకింత–నాకింత అని పంచుకుతింటారంటూ ఆరోపణలు

సాక్షి, అమరావతి: మీ అమ్మాయికో.. అబ్బాయికో అవసరమైన ల్యాప్‌టాప్‌ను కొనివ్వాలంటే మీరేం చేస్తారు? అత్యాధునిక ఫీచర్స్‌తో పేరెన్నికగన్న సంస్థ తయారు చేసిన ల్యాప్‌టాప్‌ కొనాలని చూస్తారు. నాలుగైదు దుకాణాల్లో ఆ ల్యాప్‌టాప్‌ ధరను వాకబు చేసి.. తక్కువ ధరకు నాణ్యమైనది కొనుగోలు చేస్తారు. మీరే కాదు, ఎవరైనా అదే పని చేస్తారు. కానీ.. చంద్రబాబు సర్కార్‌ మాత్రం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ల కోసం బహిరంగ మార్కెట్‌ ధర కంటే ఒక్కో ల్యాప్‌టాప్‌ను అదనంగా రూ.38,500 నుంచి రూ.40,500 ధరకు అస్మదీ­యుని సంస్థ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధ­మైం­ది. ఈ మేరకు 27,672 ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. తద్వారా రూ.106.53 కోట్ల నుంచి రూ.112.07 కోట్ల మేర అస్మదీయునికి ప్రయోజనం చేకూర్చి, నీకింత–నాకింత అంటూ పంచుకు తినేందుకు ముఖ్యనేత సిద్ధమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి.. మేకిన్‌ ఇండియా స్ఫూర్తిని మంటగలుపుతూ అక్రమాల పర్వం కొనసాగింది. దేశంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించా­లనే లక్ష్యంతో సమగ్ర శిక్ష అభియాన్‌ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ఈ పథకం నిధులతో ప్రభు­త్వ పాఠశాలలకు, విద్యార్థులకు అవసరమైన ఏ వస్తు­వులు కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ ప్లేస్‌లో టెండర్‌ ద్వారా సేకరించాలని నిర్దేశించింది. మేకిన్‌ ఇండి­యా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేశంలో తయారైన వస్తువులను మాత్రమే సేకరించా­లని నిబంధన పెట్టింది. రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. ఆ ల్యాబ్‌లకు అవసరమైన 27,672 ల్యాప్‌టాప్‌లు (హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ జీ1ఎం–8జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ) సరఫరా చేయా­లని కోరుతూ జీఈఎం ద్వారా మార్చి 19న ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ టెండర్‌ నోటిఫికేషన్‌(జీఈఎం/2026/బీ/7353884) జారీ చేశారు.  
  
నిబంధనల మార్పు వెనుక లోగుట్టు   
టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు మాత్రం ల్యాప్‌టాప్‌లు దేశంలోనే తయారైనట్లుగా మేకిన్‌ ఇండియా సర్టిఫికెట్‌ కచ్చితంగా సమర్పించాలని నిబంధన పెట్టారు. కానీ.. ఆ తర్వాత టెండర్‌లో పాల్గొనే సంస్థ ఆ ల్యాప్‌టాప్‌లను దేశంలోనే తయా­రు చేసినట్లు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందంటూ నిబంధన సడలించారు. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, డివైజ్‌ లాగ్‌లు, సెక్యూరిటీ డేటాను దేశీయంగా భద్రపరచాలన్న కేంద్ర ఎల­క్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిబంధనను తుంగలో తొక్కారు. దీనివల్ల మన విద్యార్థుల వ్యక్తిగత, కీలక సమాచారాన్ని విదేశీ శక్తులు చౌర్యం చేసే అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్మదీయులు మాత్రమే టెండర్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించేలా చేయాలనే ముఖ్యనేత ఒత్తిడి మేరకే అధికారులు ఈ నిబంధనలను సడలించారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.  

తుంగలోకి మార్గదర్శకాలు  
ముఖ్యనేత నిర్దేశించినట్లుగానే ఈ టెండర్‌లో పాల్గొనేం­దుకు సెల్‌కాన్‌ ఇంపెక్స్, శాన్‌బే నెట్‌­వర్క్స్, ది జిగ్మా టెక్నాలజీస్‌ ఇండియా అర్హత సాధించాయి. 27,672 ల్యాప్‌టాప్‌లను సరఫరా చేసేందుకు శాన్‌బే నెట్‌వర్క్స్‌ సంస్థ రూ.246,39,70,224 (ఎల్‌–1), సెల్‌కాన్‌ ఇంపెక్స్‌ రూ.254,02,89,600 (ఎల్‌–2), ది జిగ్మా టెక్నాలజీస్‌ ఇండియా రూ.279,48,72,000 (ఎల్‌–3)కు కోట్‌ చేశాయి. తక్కువ ధరకు కోట్‌ చేసిన శాన్‌బే నెట్‌వర్క్స్‌ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. కానీ.. 70 శాతం ల్యాప్‌టాప్‌లు శాన్‌బే సంస్థ, మిగతా 30 శాతం లాŠయ్‌ప్‌టాప్‌లను సెల్‌ కాన్‌ సంస్థ సరఫరా చేసేలా రాష్ట్ర సమగ్ర శిక్ష శాఖ ఒప్పందం చేసుకుందని సరఫరా సంస్థలు చెబుతున్నాయి. ఇది కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలను తుంగలో తొక్కడమేనని.. దీన్ని బట్టి సరఫరా సంస్థలు కుమ్మక్కై అధిక ధరకు బిడ్‌లు దాఖలు చేశాయన్నది స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

అస్సాం.. రూ.38,501..  ఏపీ.. రూ.89,042  
కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ ప్లేస్‌ (జీఈఎం) ద్వారా టెండర్‌ (బిడ్‌ నెంబరు జీఈఎం/2025/­బీ/6920488) నిర్వహించి.. హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ జీ1ఎం11(8జీబీ ర్యామ్‌/32జీబీ మెమరీ) ల్యాప్‌టాప్‌ను ఒక్కొక్కటి రూ.38,501.81 చొప్పున అస్సాం విద్యా శాఖ సేకరించింది. 

⇒ అదే జీఈఎం ద్వారా రాష్ట్ర సమగ్ర శిక్ష శాఖ 27,672 హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ జీ1ఎం (8జీబీ ర్యామ్‌/64జీబీ మెమరీ) ల్యాప్‌టాప్‌లను రూ.246,39,70,224కు సరఫరా చేసేలా కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అంటే ఒక్కో ల్యాప్‌టాప్‌ను 89,042కు కొనుగోలు చేసినట్లు స్పష్టవుతోంది. బహిరంగ మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్‌ రూ.43 వేల నుంచి రూ.45 వేల లోపు లభ్యమవుతోంది. క్రోమ్‌ ఎడ్యుకేషన్‌ అప్‌గ్రేడ్, యూఈఎం లైసెన్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసేందుకు రూ.3 వేలు, అండ్రాయిడ్‌ ఎంటర్‌ప్రైజస్‌ సిఫార్సు చేసే డీఎంఎస్, డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ లేయర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసేందుకు రూ.2,500 వ్యయం అవుతుందనుకున్నా ఒక్కో ల్యాప్‌టాప్‌ ధర రూ.48,500 నుంచి రూ.50,500 లోపే ఉంటుంది.  

⇒ వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో ల్యాప్‌టాప్‌ను రూ.38,500 నుంచి రూ.40,500 అధిక ధరకు కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. దీని వల్ల వాటిని సరఫరా చేసే కాంట్రాక్టు సంస్థకు రూ.106.53 కోట్ల నుంచి రూ.112.07 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోందని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement