అరటితోటను ధ్వంసం చేస్తున్న జేసీబీ
ఉండవల్లి రైతులపై చంద్రబాబు సర్కార్ దౌర్జన్యం
భూములివ్వలేదని అన్నదాతపై కక్షసాధింపు
పథకం ప్రకారం కోర్టు సెలవుల్లో దాడి
విరుచుకుపడిన వందలాదిమంది పోలీసులు
వెంటతెచ్చిన జేసీబీలతో పంట పొలాలు ధ్వంసం
రైతులను పక్కకు ఈడ్చేసి.. మహిళలను వెనక్కు నెట్టేసి
పంట కోసుకునే వరకు ఆగాలన్నా కనికరించని ఖాకీలు
కన్నీరు మున్నీరవుతున్న రైతులు.. చంద్రబాబుకు ఓటేసి పొరపాటు చేశామని దుమ్మెత్తి పోసిన మహిళలు
సోమవారం కోర్టు తెరిచే సమయానికి రోడ్డు పూర్తి చేయాలన్న హడావుడి
తవ్వేసిన పొలాల్లో వేగంగా రోడ్డేస్తున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: అది చంద్రబాబు కలల రాజధాని.. కానీ రైతుకంట నిత్యం కన్నీరే.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని, పంటపొలాలు తవ్వేస్తున్నారని రాజధాని రైతులు రోదించడం రోజూ చూస్తూనే ఉన్నాం.. తమ పొలాలను కాపాడి తమను ఆదుకోవాలని అందరినీ అరి్ధంచడం వింటూనే ఉన్నాం.. ఉండవల్లి రైతులపై చంద్రబాబు ప్రభుత్వం శనివారం ఒక్కసారిగా దౌర్జన్యకాండకు తెగబడింది. రైతుల పొలాల్లో శనివారం వందలాది పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములివ్వని రైతుల పొలాల్లోకి పోలీసులు చొరబడ్డారు. జేసీబీలతో ఆ పొలాల్లో ఉన్న పంటలను ధ్వంసం చేశారు. కాస్త సమయమిస్తే పంట కోసుకుంటామని రైతులు వేడుకున్నా వినలేదు. అడ్డొచ్చిన రైతులను పక్కకు ఈడ్చేశారు. రైతు కుటుంబాలలోని మహిళలను తాళ్లు అడ్డు పెట్టి వెనక్కి నెట్టేశారు.
ఒక పథకం ప్రకారం..
శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావడంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా శనివారం తెల్లవారుజామునుంచే ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డులో ఉన్న పంట పొలాలను పోలీసులు రౌండప్ చేశారు. అధికారులు వచ్చీ రాగానే అక్కడ ఉన్న జేసీబీ, పెద్ద పెద్ద బుల్‌డోజర్లతో పంటలను నేలమట్టం చేసేసి భూమిని చదును చేసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన రైతులను పక్కకు ఈడ్చి పడేశారు. అధికారులతో మాట్లాడతాం, పంటలు నాశనం చేయొద్దంటూ రైతులు జేసీబీలకు అడ్డుపడి వేడుకున్నా వినలేదు. పోలీసులు రైతులను పక్కకు లాగేశారు.
మొత్తం సీడ్‌యాక్సెస్ రోడ్డులో 2.47 ఎకరాలు పెండింగ్‌లో ఉండగా, 10మంది రైతులున్నారు. ఆ పొలాలు కూడా ఒకచోట 10సెంట్లు, మరోచోట్ల 5సెంట్లు, మరోచోట 20 సెంట్లు ఉండటంతో రైతులందరూ ఒక్కచోట లేరు. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి సంఘ విద్రోహక వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరిస్తారో అలా రైతుల పట్ల వ్యవహరించారు. తాము తాతలు, తండ్రుల హయాం నుంచి ఈ పొలంలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నామని, తమ ఆస్తి మీద ఎటువంటి హక్కు లేకుండా ఎలా దౌర్జన్యం చేస్తారని వారు ప్రశ్నించారు. కొందరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ నలుగురు, ఐదుగురు రైతులను పంట పొలాల నుంచి ఎత్తుకెళ్లారు. తాము అధికారులతో మాట్లాడాలని, తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని మొత్తుకుంటున్నా వినకుండా ఈడ్చుకెళ్లారు.
కన్నీరు మున్నీరైనా కనికరించలేదు
చంద్రబాబు ఇంటి సమీపంలో ఉన్న ఒక రైతు పోలీసుల నుంచి తప్పించుకుని అక్కడ ఉన్న సీఆర్‌డీఏ ఉండవల్లి డెప్యూటీ కలెక్టర్ చిన్ని కృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. నీతో నేను మాట్లాడను, నువ్వు ఇక్కడినుంచి బయటకు వెళ్లు, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకుందామని చేతులు ఊపుతూ వ్యంగ్యంగా మాట్లాడారు. మరో మహిళ పరిస్థితి ఇలానే ఉంది. కుమార్తెను, కొడుకును ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి కిందపడేసి లాక్కెళ్లారు. ఆ మహిళా రైతు ఎంత ఏడ్చినా కనికరించలేదు. మీరు అన్నం తినే బతుకుతున్నారు.
రోడ్లువేస్తే ఆ మట్టి తిని బతకరు కదా అంటూ మహిళా రైతు పోలీసులను ప్రశి్నంచింది. ఓ కానిస్టేబుల్ చెయ్యిఎత్తి కొట్టే ప్రయత్నం చేశారు. ఇస్కాన్ టెంపుల్ వద్ద ఇద్దరు రైతులు 60 సెంట్లు, 1.20 ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. దొండ కోతకు వచ్చింది, గంట సమయం ఇవ్వండి కాయలు కోస్తామని రైతు వేడుకున్నా మూడు నిమిషాల్లో మూడు పొక్లెయిన్లతో దొండతోటను నాశనం చేసేశారు. అక్కడ ఉన్న నీటి పైపులను లాక్కునేందుకు కూడా అక్కడ ఉన్న సీఆర్‌డీఏ అధికారులు సమయం ఇవ్వలేదు.
రైతులకు వైఎస్సార్‌సీపీ భరోసా
చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యకాండకు గురైన ఉండవల్లి రైతులను వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలు పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి ఉండవల్లి రైతులతో వారు సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త, దొంతిరెడ్డి వేమారెడ్డి, సీపీఎం రైతుసంఘం జిల్లా కార్యదర్శి జొన్నా శివశంకర్, ఇంకా రెండుపారీ్టలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. భూములిచ్చిన రైతులకే ఇంతవరకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, ఇక భూములివ్వని రైతుల భూములు లాక్కుని ఏం చేస్తారని వేమారెడ్డి, శివశంకర్ ప్రశ్నించారు. రైతుల పక్షాన న్యాయపోరాటానికి సహకరిస్తామని, శనివారం నాటి దౌర్జన్యానికి కారకులైన వారికి శిక్షపడేలా చేస్తామని పేర్కొన్నారు.
కోర్టు సెలవుల నేపథ్యంలో అర్ధరాత్రి దౌర్జన్యం
‘మేం కోర్టును ఆశ్రయించాం. కోర్టు సెలవులు చూసుకుని శుక్రవారం అర్ధరాత్రి, ఇళ్లల్లో మగవాళ్లు లేని సమయంలో ఉండవల్లి సీఆర్‌డీఏ డెప్యూటీ కలెక్టర్ చిన్నికృష్ణ సిబ్బందితో మా ఇళ్లకు వచ్చి దౌర్జన్యం చేశారు. మహిళలు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవార్డు పాస్ చేసిన పత్రాలు కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. రైతులకు ఏమీ ఇవ్వకుండా కోర్టు సెలవు దినాల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పొలాలను పూడ్చేసిన వెంటనే రోడ్డు వేసే పనులు మొదలుపెట్టేశారు. రైతులు సోమవారం కోర్టును ఆశ్రయించేలోగా రోడ్డు పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.

మా శవాలపై రోడ్లు వేయండి
మా తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులపై వీళ్ల దౌర్జన్యం ఏమిటో అర్థం కావడం లేదు. 60 సెంట్ల పొలంలో సాగు చేసుకుంటున్న పంటను నాశనం చేశారు. వందలాదిగా పోలీసులు, అధికారులు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని మహిళలని కూడా చూడకుండా పొలంలోంచి బయటకు నెట్టేసి మా షెడ్డును ధ్వంసం చేశారు. చంద్రబాబు రోడ్లు వేయాలనుకుంటే మా శవాలపై వేయమనండి. కోర్టులో విషయం తేల్చకుండా ఇలాంటి దౌర్జన్యాలు చేయడం చాలా దుర్మార్గం. బాబుకి ఓటు వేసినందుకు మాకు బుద్ధి చెప్పారు. – సింగంశెట్టి అనుపమ, బాధితురాలు
మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు
సీఆర్‌డీఏ అధికారులు, పోలీసులు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. నాకు నా తండ్రి నుంచి 40 సెంట్లు వచ్చింది. ఆ భూమి ఆడపిల్లకు ఇచ్చాం. ఇప్పుడు వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి. మేం అమ్ముకుంటాం రిజి్రస్టేషన్ చేయమని పలుమార్లు అడిగాం. అమ్ముకునే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఈ పరిస్థితుల్లో ఈ భూమిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇలా దౌర్జన్యం చేస్తే రైతులు ఎలా బతకాలి. – చందు బసవయ్య, బాధిత రైతు
మరీ ఇంత దౌర్జన్యమా..?
మనుషలమని కూడా చూడకుండా ఇక్కడకు వచ్చిన పోలీసులు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారు. రైతులు వ్యవసాయం చేస్తారే తప్ప, దౌర్జన్యం చేయడం తెలియదు. చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు ఇలాంటి అవమానాలు రైతులకు తప్పడం లేదు. ఎన్నోసార్లు మా అభిప్రాయాలు చెబుతామని కుటుంబంతో సహా సీఆర్‌డీఏ ఆఫీస్‌కు వెళ్లాం. అక్కడ మాగోడు పట్టించుకున్న నాథుడు లేరు. పంట సాగులో ఉన్న సమయంలో యంత్రాలతో నాశనం చేయడం దుర్మార్గం. – అనూష, బాధిత మహిళా రైతు
రూ.రెండు లక్షలు నష్టం
ఉండవల్లిలో 70 సెంట్ల పొలం రూ.50 వేలకు కౌలుకు తీసుకుని దొండపాదులు పెట్టాం. రెండో కోత కోస్తున్నాం. ఇప్పటికే రూ.1.30 లక్షలు ఖర్చు అయ్యింది. మందులు మరో రూ.10 వేలు అయ్యింది. పొలం దున్నుతున్న సమయంలో నేను అక్కడ ఉన్న అధికారులను అడిగాను. పొలం సాగు చేస్తున్న సమయంలో ఏ అధికారి వేయవద్దని చెప్పలేదు. నేను ఖర్చు పెట్టిన రూ.2 లక్షలు ఎవరిస్తారు. – వలీ, పెనుమాక కౌలు రైతు


