గడువు పెంచే ప్రసక్తేలేదన్న సీఈవో వివేక్ యాదవ్
14 అర్ధరాత్రిలోగా ఎన్యూమరేషన్ ఫామ్స్ అప్‌లోడ్ చేసుకోవాలి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఇంటింటి సర్వే మరో మూడు రోజుల్లో ముగియనుందని, జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్ మ్యాపింగ్ యాప్ పని చేయడం ఆగిపోతుందని, గడువు పెంచే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జూలై 11 సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3,61,23,312 ఓటర్ల వివరాలు డిజిటలైజ్డ్ అయ్యాయని, మిగిలిన మూడు రోజుల్లో 55,04,382 ఓటర్ల వివరాలను డిజిటలైజ్డ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ఇప్పటి వరకు డిజిటలైజ్డ్ అయిన ఓటర్లలో సుమారు 10 శాతం మంది ఓటర్లలో మరణించిన వాళ్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారు, దొరకని ఓటర్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జూలై 21న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు మరణించిన, డూప్లికేట్, దొరకని ఓటర్ల వివరాల జాబితా కూడా పోలింగ్ కేంద్రాలు, సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు. జాబితాలో పేరులేని వారు 2002 ఓటర్ల జాబితా వివరాలను తీసుకొని ఫారం–6 ద్వారా బీఎల్‌వోతో ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు.
2002 జాబితాలో పేరు లేని వారు గుర్తించిన 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి జత చేయడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 21న జాబితాలో పేర్లు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆగస్టు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటనతో రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ఎప్పటిలాగే కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందన్నారు.


