ఉద్యోగం పోయిందని లేదా తొలగించిందనే విషయం.. సాధారణంగా కంపెనీ నుంచి వచ్చే అధికారిక సమాచారం ద్వారా తెలుస్తుంది. కానీ.. ఓ 31 ఏళ్ల వ్యక్తికి మాత్రం తన ఉద్యోగం కోల్పోయిన విషయం చాలా విచిత్రమైన రీతిలో తెలిసిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్న ఆ వ్యక్తి.. నా ఉద్యోగం ముగిసిందని కంపెనీ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం రాలేదని వెల్లడించాడు. అయితే.. తనకు తెలియకుండానే ఆఫీస్ మెయిల్‌లోని 'అవుట్ ఆఫ్ ఆఫీస్' రిప్లైను మార్చారని చెప్పాడు. అందులో తాను ఇక కంపెనీలో ఉద్యోగి కాదని, తనను సంప్రదించాలనుకునే వారు మేనేజర్‌ను సంప్రదించాలని పేర్కొన్నట్లు వివరించాడు.
నిజానికి అతడు సెలవుల్లో ఉన్న సమయంలో.. మేనేజర్ నుంచి అకస్మాత్తుగా ఒక కాల్‌లో పాల్గొనాలని మెసేజ్ వచ్చింది. అయితే.. వేరే టైమ్ జోన్‌లో ఉండటం, ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఆ కాల్‌కు హాజరు కాలేనని చెప్పాడు. దీనికి తన మేనేజర్ 'మీ సెలవులను కొనసాగించండి' అని చెప్పాడు. ఇదే తన ఉద్యోగానికి ఎసరుపెడుతుందని ఊహించలేకపోయానని చెప్పాడు. ఎందుకంటే తన మేనేజర్ చెప్పిన మాటల్లో కూడా ఉద్యోగం ప్రమాదంలో ఉందనే విషయం గ్రహించలేకపోయానని స్పష్టం చేసాడు.

ఉద్యోగం పోయిందనే విషయం తన చాలా ఆశ్చర్యంగా అనిపించిందని అతను చెప్పాడు. ఎందుకంటే జనవరిలోనే తనకు ప్రమోషన్ వచ్చిందని, తన పనితీరుపై సహచరులు, ఉన్నతాధికారుల నుంచి మంచి అభిప్రాయాలు ఉన్నాయని తెలిపాడు. అంతేకాకుండా.. కొద్ది రోజుల ముందు తన బాస్‌తో కలిసి భోజనం కూడా చేశాను. అప్పుడు కూడా ఉద్యోగం కోల్పోయే ఎలాంటి సంకేతాలు కనిపించలేదని వెల్లడించాడు.
సెలవులు ముగిసిన తర్వాత ఏం చేయాలో తెలియక అతను రెడ్డిట్‌లో సలహాలు కోరాడు. తన పరిస్థితి అర్థం కావడం లేదని, షాక్‌లో ఉన్నానని చెప్పాడు. దీనిపై స్పందించిన చాలామంది నెటిజన్లు అతనికి మద్దతుగా నిలిచారు.
ఉద్యోగానికి సంబంధించిన అన్ని ఈమెయిల్స్, మెసేజ్‌లు, ఆధారాలను భద్రపరచుకోవాలని కొందరు సూచించారు. మరికొందరు మాత్రం మిగిలిన సెలవులను ప్రశాంతంగా గడపాలని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.
ఈ ఘటన ఉద్యోగులను తొలగించే విధానంపై మరోసారి చర్చకు దారితీసింది. ఉద్యోగం నుంచి తొలగించడం కంపెనీలకు అవసరమైన నిర్ణయం అయినప్పటికీ.. సెలవుల్లో ఉన్న ఉద్యోగికి ఈ విధంగా విషయం తెలియజేయడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులతో కంపెనీలు మరింత పారదర్శకంగా, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?


