భయంతో భారీగా సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి! | Job Fear 29 Year Old Indian IT Engineer works two jobs earns Rs 7 lakh a month | Sakshi
Sakshi News home page

భయంతో భారీగా సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి!

Jul 17 2026 4:46 PM | Updated on Jul 17 2026 6:25 PM

Job Fear 29 Year Old Indian IT Engineer works two jobs earns Rs 7 lakh a month

29 ఏళ్ల భారతీయ సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రూ.82 లక్షలకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నప్పటికీ, భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతో రోజుకు దాదాపు 16 గంటలు పనిచేస్తున్నాడు. పగటిపూట భారతీయ ఐటీ కంపెనీలో, రాత్రిపూట అమెరికా (US) సంస్థలో ఫుల్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ నెలకు సుమారు రూ.7లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ విషయాలను పర్సనల్‌ ఫైనాన్స్‌ వ్యవహారాలపై నిర్వహించే 'ఫిక్స్‌ యువర్‌ ఫైనాన్స్‌' (​Fix Your Finance) పోడ్‌కాస్ట్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సలహాదారు అన్షుమన్‌ శర్మతో జరిగిన సంభాషణలో వెల్లడించారు.

కుటుంబ పరిస్థితులే ప్రేరణ

'రోహిత్‌'గా మాత్రమే తనను పరిచయం చేసుకున్న ఈ యువకుడు, చిన్నప్పటి కుటుంబ పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇద్దరు సోదరుల్లో ఒకరే ఉన్నత చదువులు కొనసాగించే అవకాశం ఉండగా, తన అన్న చదువును వదులుకుని తనకు అవకాశం కల్పించాడని తెలిపాడు. "నేను విజయం సాధించకపోతే అది నా కుటుంబానికి వైఫల్యమే అవుతుంది" అనే భావన ఇప్పటికీ తనను మరింత కష్టపడేలా చేస్తోందని చెప్పాడు.

భారీ సేవింగ్స్‌.. ఈఎంఐలు

ఇటీవల తండ్రి అయిన రోహిత్‌, కుటుంబ అవసరాల కోసం కారు కొనుగోలు చేయడంతో పాటు రూ.85 లక్షల విలువైన 2BHK ఫ్లాట్‌ను కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం గృహ రుణానికి నెలకు సుమారు రూ.60,000, కారు లోన్‌కి రూ.28,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఇతర ఖర్చులతో కలిపి నెలవారీ వ్యయం రూ.1.3 లక్షల నుంచి రూ.1.4 లక్షల మధ్య ఉంటుందని తెలిపాడు.

రూ.82 లక్షల ఆస్తులు.. అయినా ఎందుకు భయం?

తన వద్ద ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్లలో రూ.70 లక్షలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రూ.10 లక్షలు, స్టాక్‌ మార్కెట్లో సుమారు రూ.2 లక్షల పెట్టుబడులు ఉన్నాయని రోహిత్‌ వివరించాడు. మొత్తం కలిపి దాదాపు రూ.82 లక్షల ఆస్తులు ఉన్నప్పటికీ, ఉద్యోగ భద్రతపై తనకు నమ్మకం లేదని పేర్కొన్నాడు.

దీనిపై అన్షుమన్‌ శర్మ స్పందిస్తూ, "మీ దగ్గర నాలుగేళ్ల ఖర్చులకు సరిపడా పొదుపు ఉంది. అయినా ఇంకా ఒత్తిడి ఎందుకు?" అని ప్రశ్నించారు.

ఏఐ వల్ల ఉద్యోగాలపై ఆందోళన

రోహిత్‌ సమాధానం మాత్రం ప్రస్తుతం ఐటీ రంగంలో చాలా మందిలో కనిపిస్తున్న ఆందోళనను ప్రతిబింబించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తన ఆదాయం తగ్గిపోతుందేమోననే భయం వెంటాడుతోందని చెప్పాడు. ఆ కారణంగానే  రెండు ఉద్యోగాలు చేస్తూ ఎక్కువగా సంపాదించాలని ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. ఈ క్రమంలో రోజుకు 16 గంటలు పని చేయడం వల్ల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమయం కేటాయించలేకపోతున్నానని, వ్యక్తిగత జీవితం దెబ్బతింటోందని కూడా అంగీకరించాడు.

👉ఇది చదివారా? ఈ హైదరాబాద్‌ ఐటీ దంపతుల సంపాదన పెరిగిందిలా..

లక్ష్యం రూ.7-8 కోట్లు

వచ్చే ఐదారు సంవత్సరాల్లో రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టాలనే లక్ష్యంతో ఉన్నానని రోహిత్‌ తెలిపాడు. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత భారతీయ ఉద్యోగాన్ని వదిలి, అమెరికా సంస్థలోని ఒక్క ఉద్యోగాన్నే కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

నిపుణులు ఏమంటున్నారు?

పర్సనల్‌ ఫైనాన్స్‌​ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అత్యవసర నిధి, పెట్టుబడులు, బీమా వంటి అంశాలు ఆర్థిక భద్రతకు కీలకమైనప్పటికీ, నిరంతర ఒత్తిడి, అధిక పని గంటలు దీర్ఘకాలంలో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు, ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం మారుతున్నప్పటికీ, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా అవకాశాలను పెంచుకోవచ్చని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement