పిల్లల చాటింగ్‌పై తల్లిదండ్రులకు మెసేజ్‌! | Meta AI Alert Parents Get distress Chat Notifications on Instagram Teens | Sakshi
Sakshi News home page

పిల్లల చాటింగ్‌పై తల్లిదండ్రులకు మెసేజ్‌!

Jul 17 2026 2:15 PM | Updated on Jul 17 2026 2:26 PM

Meta AI Alert Parents Get distress Chat Notifications on Instagram Teens

సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్న కొద్దీ టీనేజర్లలో మానసిక సమస్యలు, సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌లతో పిల్లలు ఎక్కువగా సమయం గడుపుతుండటం, కొన్ని సందర్భాల్లో అవి వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ ‘మెటా ఏఐ’ చాట్‌బాట్‌లో రక్షణ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై టీనేజర్లు చాట్‌బాట్‌తో ఆత్మహత్య వంటి సున్నితమైన అంశాల గురించి చర్చిస్తే తక్షణమే వారి తల్లిదండ్రులకు అలర్ట్ వెళ్లేలా సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.

ఫీచర్ పనితీరు - మానవ పర్యవేక్షణ

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పేరెంటల్ సూపర్‌విజన్’ (తల్లిదండ్రుల పర్యవేక్షణ) నియంత్రణలను ఎంచుకున్న వారికి మాత్రమే ఈ అలర్ట్‌లు అందుతాయి. పిల్లలు మెటా ఏఐతో జరిపే సంభాషణల్లో ఆత్మహత్యకు సంబంధించిన అంశాలు లేదా తమను తాము గాయపరుచుకునే ప్రస్తావనలు వస్తే ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ వ్యవస్థ దానిని గుర్తిస్తుంది. అయితే, టెక్నాలజీ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఏఐ ఫ్లాగ్ చేసిన ప్రతి చాట్‌ను మెటా అంతర్గత బృందం మ్యాన్యువల్‌గా సమీక్షిస్తుంది. ఆ తర్వాతే తల్లిదండ్రులకు యాప్ నోటిఫికేషన్, ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతారు. ఒకవేళ పిల్లల ఉద్దేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ ప్రాణ రక్షణే ధ్యేయంగా ముందుజాగ్రత్త చర్యగా అలర్ట్ పంపాలని మెటా నిర్ణయించింది.

గోప్యతకు భంగం కలగకుండా..

ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం వెళ్లినప్పటికీ పిల్లల ప్రైవసీ దెబ్బతినకుండా మెటా జాగ్రత్తలు తీసుకుంది. తల్లిదండ్రులకు పిల్లల పూర్తి సంభాషణలు (చాట్ హిస్టరీ) కనిపించవు. కేవలం తమ సంభాషణలో అటువంటి సున్నితమైన అంశం ప్రస్తావనకు వచ్చిందనే విషయం మాత్రమే తెలుస్తుంది. దీనితో పాటు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి.. వారికి మానసిక ధైర్యం ఎలా కల్పించాలనే విషయాలపై నిపుణులు రూపొందించిన గైడ్‌లైన్స్, హెల్ప్‌లైన్ నంబర్లను కూడా మెటా తల్లిదండ్రులకు అందజేస్తుంది.

కంటెంట్ నిబంధనలు - లభ్యత

ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఖాతాలన్నింటికీ దీనిని విస్తరించనున్నారు. వీటితో పాటు టీనేజర్ల ఖాతాలకు డిఫాల్ట్‌గా ‘13+ కంటెంట్ సెట్టింగ్’ (పరిమిత కంటెంట్ మోడ్) వర్తింపజేస్తున్నారు. దీనివల్ల వయసుకు సరిపోని లేదా సున్నితమైన ప్రాంప్ట్‌లకు మెటా ఏఐ స్పందించదు. అంతేకాదు, ఎవరైనా యూజర్ ఏఐ చాట్‌లో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తిస్తే నేరుగా స్థానిక అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించే మరో వ్యవస్థపై కూడా మెటా పనిచేస్తోంది. గతంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ప్రమాదంలో ఉన్న 19,000 మందిని అత్యవసర సేవల సహాయంతో కాపాడినట్లు సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో దిగొచ్చిన బంగారం ధర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement