సాక్షి, ప్రకాశం: సోషల్ మీడియా పరిచయం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తాను భర్తగా భావించిన వ్యక్తికి మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపినేని సాయి సుమంత్, కీర్తి అనే ఇద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. సుమంత్ దుబాయ్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా, కీర్తి ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు.
అయితే, కీర్తికి తెలియకుండా సుమంత్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయమై కీర్తి అతడిని నిలదీయగా.. సుమంత్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి ఆత్మహత్య చేసుకుంది. తనువు చాలించే ముందు ఆమె ఒక లేఖ రాసింది. తాను భర్తగా భావించే సాయి సుమంత్ చేతుల మీదుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలన్నదే తన ఆఖరి కోరికని ఆ లేఖలో పేర్కొంది.
కీర్తి మరణానంతరం ఆమె మృతదేహాన్ని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి నివాసానికి తీసుకువచ్చారు. చనిపోయిన కీర్తి మెడలో సాయి తాళి కట్టాలని, ఆమె అంత్యక్రియలను అతడే జరపాలని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో సాయి సుమంత్ తల్లిదండ్రులు కీర్తి కుటుంబ సభ్యులను బెదిరించి, ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు


