సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. వాటికోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు.
‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్పీ పోస్టుల భర్తీ పెద్ద స్కాం చోటు చేసుకుంది. పోటీపరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. డీఎస్సీ భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. డీఎస్సీ పరీక్ష పేపర్లుకూడా లీక్‌కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవకతవకలు. తమ వాళ్లకోసం జీవోలు ఇచ్చారు. ఈ పని అయిపోగానే ఆ జీవోలను రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నాడు. మరో వైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘‘అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలపైనే పెడుతున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్నవారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు.
..సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరిమీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టెట్ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాక ముందు నుంచీ టీచర్లుగా పనిచేస్తున్నవారికి టెట్‌ను తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులు అయినవారే. వీళ్లు ఉద్యోగాలు పొందనప్పుడు వీళ్లకు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యంకాదు. సుదీర్ఘకాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్నవారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి, వారికి సమస్యను నివేదించాలి.
..రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. ప్రైవేటు పేరుతో దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. వీటి పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా, దాదాపుగా పూర్తైనవాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కాం ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం దారుణం. వైఎస్సార్‌సీపీ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటి?. రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇవ్వడం స్కాం కాదా?. ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి.
..రాష్ట్రంలో ప్రతిదీ అవినీతి, దోపిడీయే. ఇష్టాను సారంగా భూముల కేటాయింపులు, ఇసుక, లిక్కర్, మైన్స్.. అన్నీ దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇష్టానుసారం ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో 3.6లక్షల కోట్లమేర అప్పులు చేశారు. విపరీతంగా అప్పులు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన ప్రజలకు చేసింది శూన్యం.
..సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు తీవ్రంగా నష్టోతున్నారు. భీమవరం సభ ద్వారా రైతులు ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీలేదు. ఐఆర్ లేదు. 5 డీఏలు పెండింగ్, సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే.’’ అని వైఎస్ జగన్ వివరించారు.


