ఉపాధ్యాయుడు లేడా? మేమేం చేయలేం! ఫిర్యాదు చేసుకోండి.. : ఎంఈవో | No Teacher At Sebuguda Government School Situation Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడు లేడా? మేమేం చేయలేం! ఫిర్యాదు చేసుకోండి.. : ఎంఈవో

Jul 16 2026 12:20 PM | Updated on Jul 16 2026 12:26 PM

No Teacher At Sebuguda Government School Situation Andhra Pradesh

పదవీ విరమణ పొందడంతో పోస్టు ఖాళీ

నెలరోజులైనా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలి పర్యవేక్షణలో నిర్వహణ

అల్లూరి సీతారామరాజు: ముంచంగిపుట్టు మండలంలోని మాకవరం పంచాయతీ సేబుగుడ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, కనీసం ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు పర్యవేక్షించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు నైకం పరశురాం, గెమ్మెలి శ్రీనివాస్, వంతాల గోపాల్‌ తీవ్ర ఆవేదనతో వెల్లడించారు.

పాఠశాల భవితవ్యంపై గ్రామస్తులు సమావేశమై, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని మండల విద్యాశాఖాధికారికి ఫోన్‌ ద్వారా కోరారు. అయితే, మండలంలో ఇప్పటికే పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, తాము ఏమీ చేయలేమని ఎంఈవో సమాధానమిచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని ఎంఈవో చెప్పడంతో, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు.

పాఠశాల ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొంది నెల రోజులు గడిచినా, ఇప్పటి వరకు కొత్త వారిని నియమించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల చదువు దెబ్బతింటోందని వారు వాపోయారు. ఎంఈవో స్పందించని నేపథ్యంలో పాడేరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టరుకు వినతిపత్రం సమర్పించి, తమ గోడును వెళ్లబోసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వంతాల కొములు, గోపాల్, వాసుదేవ్, పరుశురాం, అర్జున్‌ తదితర తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement