అల్లూరి సీతారామరాజు జిల్లా: ప్రియుడితో జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి జెర్రెల పంచాయతీ నిట్టమామిడిపాలెంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిట్టమామిడిపాలేనికి చెందిన కటారి మేరి (16), చింతపల్లిలోని అమరావతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఈమె జి.మాడుగులకు చెందిన ఉదయ్‌కిరణ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో సోమవారం వారిద్దరి మధ్య ఏదో విషయమై వివాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మేరి, మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమించిన యువకుడితో గొడవ జరగడం వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


