రోడ్డు లేదు.. అంబులెన్స్‌ రాదు! | Alluri And Pedabayalu Due To No Roads And Ambulance Unavailable | Sakshi
Sakshi News home page

రోడ్డు లేదు.. అంబులెన్స్‌ రాదు!

Jul 16 2026 1:38 PM | Updated on Jul 16 2026 1:42 PM

Alluri And Pedabayalu Due To No Roads And Ambulance Unavailable

తమలం గ్రామం నుంచి జ్వర పీడితులను ఎండీయూ వాహనంలో తరలింపు

అల్లూరి సీతారామరాజు, పెదబయలు: అత్యవసర సమయాల్లో 108, 104 వాహనాలు అందుబాటులో ఉండటం సాధారణం. కానీ, జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి అందుకు భిన్నం. సరైన రోడ్డు సౌకర్యం లేని గిన్నెలకోట పంచాయతీ, తమలం గ్రామంలో జ్వరపీడితులను ఆస్పత్రికి తరలించేందుకు ఎండీయూ వాహనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.

రూడకోట పీహెచ్‌సీ పరిధిలోని తమలం గ్రామానికి చెందిన బచ్చెలి చిరంజీవి, బుటారి చిన్నతల్లి, బుటారి చిన్నమ్మి, బుటారి దివ్యభారతి, బచ్చెలి యశ్వంత్, గెమ్మెలి రామారావు అనే ఆరుగురు వ్యక్తులు ఈ నెల 12వ తేదీ నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆశా కార్యకర్త అందించిన మందులు వాడినా ఫలితం లేకపోయింది. బుధవారం వారి పరిస్థితి విషమించడంతో, గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్‌ రాలేని పరిస్థితి నెలకొంది.

దీంతో గ్రామస్తులు వెంటనే స్పందించి, రేషన్‌ బియ్యం పంపిణీ చేసే ఎండీయూ వాహనంలో రోగులను ఎక్కించి, సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంబులెన్స్‌ కోసం ఎదురుచూడకుండా, సకాలంలో స్పందించి రోగులను ఆదుకున్న ఎండీయూ వాహన డ్రైవర్‌ బచ్చెలి సత్యారావు, గ్రామ యువకుడు అప్పారావులను స్థానికులు అభినందించారు.

వేధిస్తున్న మందుల కొరత
ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో మందుల కొరత తీవ్రంగా ఉందని  మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పాంగి పద్మారావు ఆరోపించారు. ఆస్పత్రికి వెళ్లిన రోగులు బయట మెడికల్‌ షాపుల్లో రూ. 400 నుంచి రూ. 500 వరకు పెట్టి మందులు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాగునీటి పథకాలు దెబ్బతినడంతో, కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. రహదారులు లేని గ్రామాలు, అత్యవసర సేవలు అందని మారుమూల ప్రాంతాల ప్రజల కోసం ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి, ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement