సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాల్పులు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది. తీరం వెంబడి గాలులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
కాగా, జులైలోనూ ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉండగా.. ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే అవకాశముదని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలున్నాయి.


