అతను ఒకప్పుడు లారీ డ్రైవర్. కుటుంబాన్ని పోషించుకునేందుకు తనవాళ్లకు దూరంగా దాదాపు రెండు దశబ్దాలు పాటు దేశమంతా తిరిగాడు. దిల్ ఉన్నోడు దునియాను ఏలతాడు అన్నట్టు రోడ్డుపై సాధారణ డ్రైవర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయనే నేడు దేశంలోని ప్రముఖ డిజిటల్ క్రియేటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. యూట్యూబ్ స్టార్ ఎదిగిన వైనం నెట్టింట విశేషంలో నిలుస్తోంది. పదండి మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాకు చెందిన రాజేష్ రవాణి సక్సెస్ స్టోరీ ఇది. హైవేపై సాధారణ వంటలు చేయడం నుండి తన సొంత తన కలల ప్రాజెక్ట్ 'లగ్జరీ ట్రక్'ను డిజైన్ చేసుకునే వరకు ఆయన ప్రయాణం కోట్లాది మందిని ఆకట్టుకుంది. రాజేష్ రవాణి 25 ఏళ్లుగా లారీ డ్రైవర్‌గా పని చేస్తూ, సుదీర్ఘ ప్రయాణాల్లో రోడ్డు పక్కనే మటన్, చికెన్, ఫిష్, పన్నీర్ వంటి రుచికరమైన వంటలు చేసేవారు. అదే ఇపుడు అనేక లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.
ఇదీ చదవండి: పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
యూట్యూబ్ స్టార్‌గా
తన కుమారుడు సాగర్ రవాణి ప్రోత్సాహంతో 2021లో 'ఆర్ రాజేష్ వ్లాగ్స్' (R Rajesh Vlogs) పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ఫేస్-రివీల్ వీడియో తర్వాత ఈ ఛానెల్‌కు ఒక్కసారిగా విపరీతమైన ఆదరణ లభించింది. ఒకప్పుడు డ్రైవింగ్ ద్వారా నెలకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల సంపాదించిన ఆయన, యూట్యూబ్ ద్వారా నెలకు రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షలు, కొన్నిసార్లు రూ. 18 లక్షల వరకు సంపాదిస్తూ ఆర్థికంగా బలపడ్డారు. అంతేనా తనకోసం ఒక స్పెషల్ ట్రక్‌ను కూడా డిజైన్ చేసుకున్నారు. ఒక సందర్భంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆయన పట్టుదలను ప్రశంసించడం విశేషం.
ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్
స్పెషల్ లగ్జరీ ట్రక్
తన డిజిటల్ సంపాదనతో రోడ్డుపై జీవనానికే అనువుగా పూర్తి ఏసీ, కస్టమ్-బిల్ట్ స్టోరేజ్ క్యాబినెట్లు, ఆధునిక వంటగది సదుపాయాలతో కూడిన 'భారతదేశపు అత్యంత విలాసవంతమైన ట్రక్'ను డిజైన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు యూట్యూబ్‌లో దాదాపు 3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు, బిలియన్‌కు పైగా వ్యూస్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ఇదీ చదవండి: లవర్‌ను పెళ్లాడి బిహార్‌కు, ఇన్‌స్టాలో అమెరికా అమ్మడు సందడి


