దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులమని చెప్పి ఓ మైనర్ బాలికను బెదిరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ మందిరం దగ్గర ఉన్న పార్కులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 17 ఏళ్ల బాలిక సోమవారం సాయంత్రం తన 17 ఏళ్ల స్నేహితుడితో కలిసి కల్కాజీ మందిరానికి వెళ్లింది. అక్కడ పూజాలు చేశాక.. ఆలయానికి పక్కనే ఉన్న పార్కుకు వెళ్లారు. వాళ్లు ఒంటరిగా ఉండడం గమనించిన ముగ్గురు.. తాము పోలీసులమంటూ వాళ్లను బెదిరించారు. వాళ్లలో ఇద్దరూ ఆ బాలుడ్ని మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లగా.. ఒకడు బాలికను తుపాకీ, కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మిగిలిన ఇద్దరూ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఘటన గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇద్దరినీ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు బాధితులను గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.
సీసీటీవీలతో నిందితుల కోసం..
కల్కాజీ మందిరం–ఇస్కాన్ ఆలయాన్ని కలిపే మార్గంలోని పార్కులో ఘటన జరిగినట్లు పోలీసులకు రాత్రి 8.45 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్కుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు, పరిసరాల్లో సంచరించిన వ్యక్తుల వివరాలను సేకరించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
పోలీసులపై కాల్పులు.. కుడికాలికి బుల్లెట్
దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు ఢిల్లీలోని అమర్ కాలనీ పరిధిలోని డీఎం ఆఫీస్ రోడ్డువైపు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ వలపన్ని అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోగానే నిందితుడు కాల్పులు జరిపాడు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కుడికాలికి బుల్లెట్ తగిలింది. గాయపడ్డ అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పేరు అసిఫ్ అని.. ఓఖ్లా మండీలో పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై పోక్సో సహా సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు.
Minor Girl Allegedly Sexually Assaulted at Astha Kunj Park; Accused Injured in Police Encounter
A 17-year-old girl was allegedly sexually assaulted by three men at Delhi’s Astha Kunj Park after the accused allegedly posed as policemen and separated her from her male friend,… pic.twitter.com/6vtUPaPHnk— Atulkrishan (@iAtulKrishan1) September 22, 2026
పది రోజుల్లో నాలుగో ఘటన
ఢిల్లీలో పది రోజుల వ్యవధిలో మైనర్లపై అత్యాచారానికి సంబంధించిన నాలుగు ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ 13న స్వరూప్‌నగర్‌లో 17 ఏళ్ల బాలికపై నలుగురు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. సెప్టెంబర్ 16న సదర్‌బజార్‌లో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. సెప్టెంబర్ 21న కిషన్‌గంజ్‌లో ఆరేళ్ల బాలికపై 34 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా కల్కాజీ ఘటన ఈ వరుసలో చేరింది.
ఇదీ చదవండి: ఆ అమ్మాయిని అలా వేధించడం కామన్ అంట!


