3 ప్రాంతాల్లో విషాదం.. నీటిలో మునిగి 9 మంది యువకులు మృతి | Nine youths drown in Gujarat five deaths linked to Ganesh idol immersion | Sakshi
Sakshi News home page

3 ప్రాంతాల్లో విషాదం.. నీటిలో మునిగి 9 మంది యువకులు మృతి

Sep 26 2026 1:12 AM | Updated on Sep 26 2026 1:19 AM

Nine youths drown in Gujarat five deaths linked to Ganesh idol immersion

Representative image

గుజరాత్‌లోని సూరత్‌, అమ్రేలీ, మోర్బీ జిల్లాల్లో నీటిలో మునిగి తొమ్మిది మంది యువకులు మృతిచెందారు. శుక్రవారం ఏడుగురు మునిగిపోగా, గురువారం మోర్బీలో గణేశ్‌ విగ్రహ నిమజ్జనం సమయంలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు 24 గంటల్లో లభించాయి.  

సూరత్‌లోని ధోరన్‌ పార్డీ గ్రామం సమీపంలో తాపీ నదిలో చిన్న చేపల పడవ బోల్తా పడటంతో ముగ్గురు మునిగిపోయారు. విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లిన శార్దుల్‌ మేర్‌ (23), రాజు మేర్‌ (23), దానా షియాలియా (26) మృతిచెందారు. వీరంతా ఖోల్వాడ్‌ గ్రామానికి చెందినవారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. వారి ఇళ్లకు సుమారు 300 మీటర్ల దూరంలో కృత్రిమ నిమజ్జన కొలను ఏర్పాటు చేసినప్పటికీ, సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని నదికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.  

అమ్రేలీ జిల్లాలోని బాబ్రా తాలూకా మోటా దేవాలియా వద్ద చెక్‌డ్యామ్‌లో స్నానం చేస్తూ నలుగురు యువకులు మునిగిపోయారు. మోటా దేవాలియాకు చెందిన కనుభాయ్‌ షింగాలా, సచిన్‌భాయ్‌ షింగాలా, నవాగఢ్‌కు చెందిన భాలా జేత్వా, కెవిన్‌ జేత్వాగా వారిని గుర్తించారు.

నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మోర్బీలోని సదుల్కా గ్రామం సమీపంలోని మచ్చూ నదిలో గురువారం గణేశ్‌ విగ్రహ నిమజ్జనం సందర్భంగా నలుగురు యువకులు నీటిలో చిక్కుకున్నారు. అక్షయ్‌ మాలియా, అక్షయ్‌ గజానంద్‌ను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విలాస్‌ గైక్వాడ్‌, సోహన్‌ కుల్దియా కోసం గాలింపు చేపట్టారు. గైక్వాడ్‌ మృతదేహం అర్ధరాత్రి సమయంలో, కుల్దియా మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement