కస్తూరి రంగన్‌ నివేదికపై వ్య‌తిరేక‌త ఎందుకు? | Why Malenadu, Karavali People Oppose Kasturirangan Report on on Western Ghats | Sakshi
Sakshi News home page

చర్చనీయాంశంగా కస్తూరి రంగన్‌ నివేదిక

Sep 25 2026 6:25 PM | Updated on Sep 25 2026 6:54 PM

Why Malenadu, Karavali People Oppose Kasturirangan Report on on Western Ghats

పశ్చిమ ఘాట్ల పరిరక్షణకు చేసిన సిఫారసుల ఏమిటి? 

నివేదిక అమలును ఎందుకు వద్దంటున్నారు

నివేదిక అమలు చేస్తే ఘాట్లలో గ్రామాలకు జరిగే హాని ఎంత?

సాక్షి బెంగళూరు: పశ్చిమ కనుమల పరిరక్షణకు కస్తూరి రంగన్ సమర్పించిన నివేదికపై కన్నడనాట జోరుగా చర్చ సాగుతోంది. ఈ నివేదిక అమలు చేయాలా వద్దా అనే విషయంపై విధానసభలో కూడా వాడీవేడి చర్చ జరిగింది. మలేనాడు, కరావళి ప్రాంత ప్రజలు ఈ నివేదికను అమలు చేయకూడదని చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే ప్రజల అభీష్టం మేరకు కస్తూరి రంగన్‌ నివేదిక అమలు ప్రస్తుతానికి అమలు చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రస్తుతం కస్తూరి రంగన్‌ నివేదిక తుది జాబితా సిఫారసులు యథాతథంగా అంగీకరించడం సాధ్యపడదని, ఈ  అంశంపై విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ఆ తర్వాత తమ అభిప్రాయాలను తెలియజేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ నివేదిక ఏంటి? ఎందుకు ప్రజలు వద్దనుకుంటున్నారో పరిశీలిద్దాం..

2013లో కస్తూరి రంగన్‌ నివేదిక  
పశ్చిమ కనుమల్లో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు డాక్టర్‌ కె. కస్తూరి రంగన్‌ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసింది. 2013లో ఈ కమిటీ పశ్చిమ ఘాట్ల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులు చేస్తూ ఒక నివేదికను కేంద్రానికి సమర్పించింది. తమ నివేదికలో పొందుపరిచిన సిఫారసులను అమలు చేస్తే పశ్చిమ ఘాట్ల పరిసరాలను కాపాడవచ్చునని, మనిషి మనుగడ సజావుగా సాగుతుందని కమిటీ అభిప్రాయపడింది. తక్షణ‌మే పశ్చిమ ఘాట్లను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  

నివేదికలో ఇంకా ఏముంది? 
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పశ్చిమ ఘాట్లు కలిగి ఉన్నాయి. మొత్తం 1,64,280 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో పశ్చిమ ఘాట్లు ఉన్నాయి. పశ్చిమ ఘాట్ల ప్రాంతంలో సుమారు 37 శాతం అంటే 56,825 చ.కి.మీ.లు పర్యావరణ సున్నిత ప్రాంతంగా కమిటీ సిఫారసులు చేసింది. కర్ణాటకలోని 44,448 చ.కి.మీ. మేర ప్రాంతం పశ్చిమ ఘాట్లు ఉంటే అందులో 20,668 చ.కి.మీ ప్రాంతాన్ని అతి సూక్ష్మ పర్యావరణ జోన్‌గా తీసుకురావాలని కమిటీ సూచించింది. 

పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ సున్నిత జోన్‌ ప్రాంతంలో ఎలాంటి మైనింగ్, క్వారీ, చెట్ల తొలగింపు, పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిని సంపూర్ణంగా నిషేధించాలని సూచించింది. దీనితోపాటు టౌన్‌షిప్‌లు, భారీ కట్టడ నిర్మాణాలు, ఉష్ణ, జల, పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలు జరగకూడదని కూడా తేల్చి చెప్పింది. వాణిజ్య పర్యాటకాన్ని తగ్గించాలని సూచించింది.  

కర్ణాటకలో ఎందుకు వ్యతిరేకత..? 
కర్ణాటకలోని మొత్తం 10 జిల్లాల ప్రజలు ఈ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తున్నారు. ఈ 10 జిల్లాల్లో మొత్తంగా సుమారు 1500కు పైగా గ్రామాలు ఈ అతిసూక్ష్మ పర్యావరణ జోన్‌ పరిధిలోకి వెళతాలయి. ఈ కమిటీ నివేదిక సిఫారసులు అమల్లోకి వస్తే కరావళి, మలేనాడు ప్రాంతాల్లోని ముఖ్యంగా ఈ పది జిల్లాల ప్రజల జీవనానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. సూక్ష్మజోన్‌గా ఈ గ్రామాలను ప్రకటిస్తే మానవ జోక్యానికి, అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. కాలక్రమేణా వ్యవసాయం, ఉద్యాన కార్యకలాపాలు, ఇతరత్ర దైనందిన జీవనోపాధి పనులకు ఆటంకం కలుగుతుంది.

ఇదీ చ‌ద‌వండి: దర్శన్‌కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు

ఈ ప్రాంత ప్రజలకు ఎక్కువగా కాఫీ, రబ్బర్, నల్ల మిరియాలు ప్రధాన జీవనాధారం.. కమిటీ నివేదిక అమలు పరిస్తే ఈ పంటలకు అవసరమయ్యే ఎరువులు, కీటకనాశకద్రవ్యాల వినియోగంపై నిషేధం విధించాల్సి వస్తుంది. కొత్తగా ఉద్యాన తోటలను విస్తరించడం సాధ్యపడదు. అలాగే ఈ కమిటీ నివేదిక అమల్లోకి వస్తే తమ ఇళ్లను కూల్చేసి ఇక్కడి నుంచి తరిమేస్తారనే భయం వెంటాడుతోంది. అలాగే ఊర్ల కోసం రోడ్లు, వంతెనలు, విద్యుత్, ఆస్పత్రి, పాఠశాలలను నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ అనుమతులు కొంచెం కఠినతరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడి హోంస్టేలు పర్యావరణానికి బలమైన కోటగా మారాయి. హోంస్టేల వాణిజ్య కార్యకలాపాలకు అడ్డుగా మారవచ్చు. ప్రధానంగా తమ దైనందిన జీవితం దుర్బరంగా మారుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
కర్ణాటకలోని ఏ జిల్లాలకు సమస్య..? 
బెళగావి, ఉత్తరకన్నడ, ఉడుపి, దక్షిణ కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన్, కొడగు, చామరాజనగర, మైసూరు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement