షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. భార్య, కొడుకు మిస్సింగ్‌! | Sharjah Mystery: Indian Man Murdered Body Found in 9 Pieces Wife and Son Missing | Sakshi
Sakshi News home page

షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. భార్య, కొడుకు మిస్సింగ్‌!

Sep 23 2026 10:52 AM | Updated on Sep 23 2026 11:03 AM

Sharjah Mystery: Indian Man Murdered Body Found in 9 Pieces Wife and Son Missing

యూఏఈలో జరిగిన ఘోరం.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షార్జాలో భారతీయుడి మిస్టరీ కేసు విషాదాంతంగా ముగిసింది. అతని మృతదేహం ఓ కారులో ముక్కలుగా లభించగా.. భార్య, కొడుకు కనిపించకుండా పోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది. మృతుడ్ని కర్ణాటకకు చెందిన అల్విన్‌ ప్రకాశ్‌ కుందర్‌గా అక్కడి అధికారులు నిర్దారించారు.

ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన అల్విన్‌ .. గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్టులో పని చేస్తుండేవారు. భార్య, కొడుకుతో ఆయన అక్కడే జీవిస్తున్నారు. అయితే జూలై 20న అల్విన్‌కు ఆయన సోదరుడు అనిల్‌ ప్రశాంత్‌ కుందర్‌ ఫోన్‌ చేశారు. అల్విన్‌ కాల్‌ ఎత్తకపోగా.. తాను బాగానే ఉన్నానంటూ మెసేజ్‌ పంపారు. సాధారణంగా వాయిస్‌ మెసేజ్‌ల ద్వారానే మాట్లాడే అల్విన్‌ ఇలా టెక్స్ట్‌ చేయడం కుటుంబ సభ్యులకు అనుమానం కలిగించింది. వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో స్నేహితుడి ద్వారా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అల్విన్‌ నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఆయన స్నేహితుడికి వాచ్‌మన్‌.. ఆయన‌ భారత్‌కు వెళ్లిపోయారని చెప్పాడు. ఆయన పని చేసే కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కొన్నాళ్లు ఆగి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు కంపెనీ అధికారులు పాస్‌పోర్ట్‌ వివరాలను పరిశీలించారు. అల్విన్‌ అప్పటికీ షార్జాలోనే ఉన్నట్లు తేలడంతో మిస్సింగ్‌ ఫిర్యాదు చేశారు.

రెండు నెలల తర్వాత.. ఒమన్‌ వైపు వెళ్లే మార్గంలో పార్క్‌ చేసిన ఓ కారులో ఓ మృతదేహం లభించింది. అందులో మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో ఉంచారు. పోస్టుమార్టం ద్వారా మృతదేహం అల్విన్‌దేనని నిర్ధారణ అయింది. హత్యకు కారణం ఏమిటి? ఎవరు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.

భార్య, కుమారుడు ఎక్కడ?
అల్విన్‌ హత్య తర్వాత ఆయన భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసులో మరో ప్రశ్నగా మారింది. వాళ్లు షార్జా నుంచి భారత్‌కు వెళ్లి ఉండొచ్చన్న ప్రచారం ఉన్నప్పటికీ.. దీనిపై అధికారిక నిర్ధారణ లేదు. హత్యలో టీనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దంపతుల మధ్య ఎలాంటి వివాదం ఉన్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఉడుపి పోలీసుల దృష్టికి..
అల్విన్‌ సోదరుడు అనిల్‌, ఉడుపి ఎస్పీని కలిసి కేసుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. షార్జా అధికారుల నుంచి అధికారిక సమాచారం కోసం ఉడుపి పోలీసులు ఎదురుచూస్తున్నారు. యూఏఈలో న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్విన్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబం ప్రయత్నిస్తోంది. హత్య వెనుక కారణం, నిందితులెవరు, అల్విన్‌ భార్య, కుమారుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది షార్జా దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడానికి దాదాపు రెండు నెలలు పట్టడం, హత్య తర్వాత అల్విన్‌ భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడి ఆచూకీ లేకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.

విదేశాల్లో భారతీయుల విషాదం..
ఉపాధి, మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు అనుకోని ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలతో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అల్విన్‌ కుందర్‌ విషయంలోనూ అసలు ఏం జరిగింది? ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? కుటుంబ సభ్యుల ఆందోళనలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది? అనేది దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది.

ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పేంత తప్పు ఆ ఎమ్మెల్యే కూతురు చేసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement