అప్పటికే నలుగురి ప్రాణాలు పోయాయి.. ఇంట్లో ముగ్గురు చిన్నారులు బందీలుగా ఉన్నారు. బయట భారీగా పోలీసులు మోహరించగా.. లోపల ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఈ హైడ్రామాకు చివరికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌తో తెరపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కొడుకుతో పాటు ఇద్దరు పూజారుల్ని కాల్చి చంపాడు. ఆపై తన ముగ్గురు పిల్లలనే ఇంట్లోనే బంధీలుగా చేసుకుని పోలీసులకు చుక్కలు చూపించాడు. సుమారు ఎనిమిది గంటల పాటు హైడ్రామా కొనసాగగా.. పోలీసులు ఆపరేషన్ చేపట్టి నిందితుడిని ఎన్‌కౌంటర్ చేశారు.
ఆజంగఢ్‌లోని అహ్రౌలా పోలీస్‌స్టేషన్ పరిధి శంభూపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అరవింద్ సింగ్ తుపాకీతో కాల్పులు జరిపి తన భార్యతో పాటు మరో ఇద్దరిని హత్య చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసు బలగాలతో పాటు ఫోరెన్సిక్ బృందాన్ని తరలించారు.
ఇంట్లో పిల్లలు బందీలు
కాల్పుల అనంతరం అరవింద్ సింగ్ తన పిల్లలను ఇంట్లో బందీలుగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆచితూచి ఆపరేషన్ చేపట్టారు. దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగిన ఉత్కంఠ.. చివరకు కాల్పులతో ముగిసింది. పోలీసుల చర్యలో ముగ్గురు పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
పోలీసుల కాల్పుల్లోనే..
పిల్లలను రక్షించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అరవింద్ సింగ్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన ఆయుధం, హత్యలకు దారితీసిన కారణాలు, మృతుల మధ్య సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆజంగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంది.. చివరకు!


