భారీగా భూవినాశనం! | Earths natural defense systems in danger | Sakshi
Sakshi News home page

భారీగా భూవినాశనం!

Sep 23 2026 5:42 AM | Updated on Sep 23 2026 5:42 AM

Earths natural defense systems in danger

ఎన్నడూ లేనంత ప్రమాదకర స్థితిలోకి భూమి సహజ రక్షణ వ్యవస్థలు 

అంతరిస్తున్న చిత్తడి నేలలు, అడవుల్లోని సహజ కర్బన నిల్వలు 

తీవ్రమవుతున్న మానవ నిర్మిత రసాయన పదార్థాల ముప్పు 

‘ప్లానెటరీ హెల్త్‌ చెక్‌–2026’నివేదికలో ఆందోళనకర అంశాలు

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: మానవాళి మనుగడకు అత్యంత కీలకమైన భూగ్రహ సహజ రక్షణ వ్యవస్థలు చరిత్రలోనే ఎన్నడూ లేనంత ప్రమాదకర స్థాయికి దిగజారాయని పర్యావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపై జీవం సురక్షితంగా వర్ధిల్లడానికి నిర్దేశించిన తొమ్మిది ప్రాకృతిక భూగ్రహ పరామితుల్లో ఇప్పటికే ఏడు పరామితులు సురక్షిత పరిధిని గతేడాదే దాటేశాయని.. ఈ ఏడాది పర్యావరణ విధ్వంసం మరింత పెరిగి ఇవి అధిక ప్రమాదకర రేఖకు అతిచేరువగా జరిగాయని ప్లానెటరీ హెల్త్‌ చెక్‌–2026 వార్షిక నివేదిక వెల్లడించింది.

జర్మనీలోని పాట్స్‌డామ్‌ ఇన్‌స్టిట్యూట్  ఫర్‌ క్‌లైమేట్‌ ఇంపాక్ట్‌ రీసెర్చ్‌ (పీఐకే) ఆధ్వర్యంలోని 60 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ నివేదికను రూపొందించింది. న్యూయార్క్‌లో జరుగుతున్న క్లైమేట్‌ వీక్‌ వేదికగా తాజాగా విడుదలైన ఈ నివేదికలో కర్బన నిల్వలు, మానవ నిర్మిత నూతన రసాయన పదార్థాల ముప్పును ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

బలహీనపడుతున్న కార్బన్‌ సింక్‌లు 
మానవ తప్పిదాల వల్ల వాతావరణంలోకి వెలువడే కర్బన ఉద్గారాలను పీల్చుకుంటూ భూమిని కాపాడుతున్న అడవులు, చిత్తడి నేలలు, సముద్రాల శోషణ సామర్థ్యం వేగంగా క్షీణిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ఇంతకాలం సహజ రక్షణ కవచాలుగా నిలిచిన ఈ కర్బన నిల్వల సామర్థ్యాన్ని మనం వాస్తవానికంటే ఎక్కువ అంచనా వేసి ఉండొచ్చని నివేదిక ప్రధాన రచయిత డా.బోరిస్‌ సాక్షెవ్‌స్కీ హెచ్చరించారు. ముఖ్యంగా భూమికి ఊపిరితిత్తులాంటి అమెజాన్‌ వర్షాధార అడవులు కోలుకోలేని స్థాయికి చేరి గడ్డి భూములుగా మారే ప్రమాదం పొంచి ఉందని నివేదిక పేర్కొంది. అదే జరిగితే అవి వాతావరణం నుంచి కర్బనాన్ని పీల్చుకుంటూ భూతాపాన్ని తగ్గించటానికి బదులుగా, భూమిలో ఉన్న కర్బనాన్ని వాతావరణంలోకి వదిలేసి భూతాపాన్ని మరింత పెంచుతాయి. 

రసాయన కాలుష్యంతో మునుపెన్నడూ లేని సంక్షోభం 
ప్లాస్టిక్‌ వంటి ప్రకృతిలో శతాబ్దాలపాటు ఉండిపోయే రసాయనాలు, సింథటిక్‌ పదార్థాల కాలుష్యం మానవాళికి పెనుసవాల్‌గా మారింది. మనుషులు తయారు చేసి వాడుతున్న లక్షలాది రకాల సరికొత్త రసాయనాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తుండగా వాటి దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేయడం కూడా అసాధ్యంగా మారుతోంది. గతంలో మానవ కాలుష్యానికి దూరంగా ఉన్నాయని భావించిన సముద్రగర్భాలు సైతం ఈ ప్రమాదకర వ్యర్థాలతో నిండిపోతున్నాయని ప్లానెట్‌ హెల్త్‌ చెక్‌ నివేదిక పేర్కొంది. ఇది సముద్ర జీవుల ఆహార గొలుసును, సమస్త జీవావరణ సమగ్రతను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 

కార్యాచరణకు ఇదే చివరి అవకాశం 
వాతావరణ మార్పులు, జీవావరణ క్షీణత, భూవినియోగ మార్పులు, మంచినీటి సంక్షోభం, రసాయనాల ప్రవాహం, ప్లాస్టిక్‌ కాలుష్యం, సముద్రాల ఆమ్లీకరణ అనే ఏడు రంగాలు ప్రమాదం అంచున ఉన్నాయని నివేదిక తెలిపింది. కేవలం ఓజోన్‌ పొర పరిరక్షణలోనే పురోగతి కనిపించింది. కార్పొరేట్‌ కంపెనీలు పర్యావరణ నష్టాలను దాచిపెట్టే ధోరణిని వీడాలని నిపుణులు కోరారు. పరిస్థితి విషమిస్తున్నప్పటికీ ఆశావహమైన విషయం ఏమిటంటే.. దీన్ని చక్కదిద్దే శాస్త్రీయ పరిజ్ఞానం మానవాళి వద్ద ఉందని పీఐకేకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ జోహన్‌ రాక్‌స్ట్రోమ్‌ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని పునరుద్ధరించకపోతే భవిష్యత్‌ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement