తరగతి గదిలో కుప్పకూలి విద్యార్థిని మృతి | Class 2 student died after suddenly falling ill at school | Sakshi
Sakshi News home page

తరగతి గదిలో కుప్పకూలి విద్యార్థిని మృతి

Sep 23 2026 3:41 AM | Updated on Sep 23 2026 3:41 AM

  Class 2 student died after suddenly falling ill at school

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో గణేశ్‌ నిమజ్జన ఊరేగింపు సమయంలో వినిపించిన భారీ డీజే శబ్దం మధ్య ఓ పాఠశాల విద్యార్థిని (7) తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. అయితే, డీజే శబ్దమే బాలిక మృతికి ప్రత్యక్ష కారణమని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

బలరాంపూర్‌ నగరంలోని డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రెండో తరగతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక వైష్ణవి తరగతి గదిలో ఉండగా సమీప రహదారి నుంచి గణేశ్‌ నిమజ్జన ఊరేగింపు వెళ్లింది. ఆ సమయంలో డీజేను పెద్ద శబ్దంతో వినిపించినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు పేర్కొన్నారు. బాలిక అస్వస్థతకు గురై తరగతి గదిలోనే కుప్పకూలిన అనంతరం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన సుమారు 3 నిమిషాల 2 సెకన్ల సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తరగతి గదిలో విద్యార్థులు కూర్చుని ఉండగా బయట నుంచి డీజే శబ్దం వినిపించింది. ఆ సమయంలో విద్యార్థులు బయట వైపు చూస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దృశ్యాల ఆధారంగా డీజే శబ్దం, బాలిక మృతికి మధ్య వైద్యపరమైన ప్రత్యక్ష సంబంధాన్ని నిర్ధారించలేమని నివేదికలు స్పష్టం చేశాయి.

సామాజిక మాధ్యమాల్లో ఘటనకు సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసును పరిశీలించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి రాతపూర్వక లేదా మౌఖిక ఫిర్యాదు అందలేదని అధికారులు తెలిపారు. ప్రాంతీయ పోలీసు అధికారి ఆదేశాలతో ఘటనాస్థలం, పాఠశాల, నిమజ్జన ఊరేగింపు మార్గం, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

డీజే అధిక శబ్దంతో మోగించడంపై నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలితే, సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాలిక మృతికి కచ్చితమైన కారణం, డీజే శబ్దంతో దానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement